కండ్ల ముందు నీళ్లున్నా..పొలాలకు ఇయ్యట్లే

కండ్ల ముందు నీళ్లున్నా..పొలాలకు ఇయ్యట్లే
  • కాంగ్రెస్​ది పంటలను కాపాడలేని చేతగాని పాలన: హరీశ్​రావు
  • కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ తెచ్చిన కరువు
  • కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లిఫ్టులను పూర్తి స్థాయిలో నడపాలని డిమాండ్​

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కండ్ల ముందు నీళ్లు పారుతున్నా పొలాలకు నీళ్లు ఇవ్వలేని చేతగాని కాంగ్రెస్ పాలన నడుస్తున్నదని బీఆర్ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​లీడర్​హరీశ్ రావు మండిపడ్డారు. పంటలను కాపాడలేని దయనీయ పరిస్థితి ఉన్నదని, ఇది రేవంత్ రెడ్డి తెచ్చిన కరువే తప్ప  కాలం తెచ్చిన కరువ కాదని విమర్శించారు. పాలమూరు బిడ్డను అని విర్రవీగే రేవంత్ రెడ్డి కృష్ణా జలాలు లిఫ్ట్​ చేయకుండా పాలమూరు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. 

గురువారం ఆయన తెలంగాణభవన్​లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతులకు నీళ్లు నిల్లు.. ఏపీ రైతులకు మాత్రం ఫుల్లు అని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థలు చెబుతున్నాయని, వచ్చిన నీళ్లను వచ్చినట్టు ఎత్తిపోయకుండా సీఎం రేవంత్​ చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. 

రేవంత్​ రెడ్డికి గురువు బాగుంటే చాలు

రేవంత్​ రెడ్డికి ఆయన గురువు బాగుంటే చాలని హరీశ్ ఫైర్ అయ్యారు. కల్వకుర్తి లిఫ్ట్​ మొదటి పంప్ హౌజ్ ఎల్లూరు పంప్ హౌజ్ లో కేవలం రెండు మోటార్లే నడుస్తున్నాయని, మిగతావి ఎందుకు బంద్​ పెట్టారని ప్రశ్నించారు. 24 గంటలూ 5 మోటార్లు నడపాల్సింది.. కేవలం 11 గంటలే నడుపుతున్నారన్నారు. 1600 క్యూసెక్కులు రావాల్సిన చోట 700 క్యూసెక్కులే వస్తున్నాయన్నారు. 

4000 క్యూసెక్కులు ఎత్త గలిగే కెపాసిటీ ఉంటే రేవంత్ రెడ్డి ఎత్తుతున్నది 700 క్యూసెక్కులేనన్నారు. చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నరని మండిపడ్డారు. ఏపీ వెలిగొండ, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించుకుపోయేందుకు సహకరిస్తున్నవా అని ప్రశ్నించారు. బేసిన్ తో సంబంధం లేని వెలిగొండ ద్వారా చంద్రబాబు నీళ్లు తీసుకుపోతుంటే బేసిన్ లో ఉండి, నికర జలాల కేటాయింపు ఉన్న భీమాను ఎందుకు నడపడం లేదని విమర్శించారు.

 నెట్టెంపాడులో నాలుగు ఉంటే ఒకటి, కోయిల్ సాగర్ లో మూడు ఉంటే ఒక పంప్​నడుపుతున్నారని వివరించారు. అసెంబ్లీలో తాము ప్రజల తరఫున మాట్లాడితే మార్షల్స్​తో ఎత్తిపడేసే రేవంత్​రెడ్డి.. మోటార్లు ఆన్​చేసి నీళ్లు మాత్రం ఎత్తడం లేదన్నారు. నీళ్లు రాక, కరెంట్​ లేక రాష్ట్రవ్యాప్తంగా రైతులు సబ్​స్టేషన్ల ముందు ధర్నా చేస్తున్నారని పేర్కొన్నారు.  

గుత్ప లిఫ్ట్​ నడపండి: వేముల ప్రశాంత్​ రెడ్డి 

నిజామాబాద్ జిల్లా రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​ రెడ్డి అన్నారు. శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులో 46 టీఎంసీల నీళ్లున్నా ఎందుకు సాగుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గుత్ప, అలీ సాగర్ లిఫ్టులు ప్రారంభించి చెరువులు నింపాలని డిమాండ్ చేస్తే తూతూ మంత్రంగా గుత్ప లిప్టులు ఆన్ చేశారన్నారు. 

నాలుగు మోటార్లకు గాను ఒక్క మోటార్ నడిపిస్తున్నారని, వెంటనే పూర్తి స్థాయిలో గుత్ప లిఫ్టును నడపాలని డిమాండ్​ చేశారు. గుత్ప, అలీసాగర్ కలిపి రోజుకు 1260 క్యుసెక్కులు, నెల రోజులు నడిపినా 3 టీఎంసీలు మాత్రమేనని, దాని వల్ల చెరువులు నిండుతాయని చెప్పారు.