హైదరాబాద్, వెలుగు: మెడికల్ బిల్స్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కింద సీఎంఆర్‌ఎఫ్ చెక్ ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఎంఆర్ఎఫ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆనందేశి రాఘవేందర్, టీఎస్‌ఐడీసీ సీనియర్ అసిస్టెంట్ మేడి వినోద్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు.
సెక్రటేరియెట్ బయట రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రాఘవేందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో వినోద్‌ను కూడా అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. టీఎస్‌ఐడీసీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి మెడికల్ బిల్స్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ క్లెయిమ్ కింద రూ.2 లక్షలు ప్రాసెస్ చేసేందుకు సెక్రటేరియెట్‌లోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాఘవేందర్ లంచం డిమాండ్ చేశాడు. గతంలోనే బాధితుడి నుంచి ఫోన్‌పే ద్వారా రూ.5 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత టీఎస్‌ఐడీసీ సీనియర్ అసిస్టెంట్ మేడి వినోద్ కూడా రంగంలోకి దిగాడు. అధికారికంగా సహాయం చేస్తానని చెప్పి రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు.
ఈ మొత్తాన్ని బాధితుడి ద్వారా సీఎంఆర్‌ఎఫ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాఘవేందర్‌కు ఇప్పించాలని వినోద్ చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ట్రాప్ స్కెచ్ వేశారు. సచివాలయం బయట ఉన్న ఆలయం వద్ద బాధితుడు రూ.లక్షను రాఘవేందర్‌కు అందించాడు. డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రాఘవేందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మేడి వినోద్‌ను కూడా అరెస్ట్ చేశారు.
