- టీజీసీహెచ్‌ఈ లేఖ రాసినా స్పష్టత ఇవ్వని విద్యాశాఖ
- కౌన్సెలింగ్ కోసం స్టూడెంట్లు, పేరెంట్స్ ఎదురుచూపులు
- డిగ్రీలో ఇంకా రెండున్నర లక్షల దాకా ఖాళీగా సీట్లు
- ఇప్పటికే జులైలోనే ప్రారంభమైన తరగతులు
హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించిన దోస్త్ ప్రక్రియ ముగిసి నెల రోజులు కావొస్తున్నా.. మిగిలిన సీట్ల భర్తీకి చేపట్టాల్సిన స్పాట్ కౌన్సెలింగ్‌పై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. స్పాట్ కౌన్సెలింగ్ ఉంటుందా లేదా అనేది విద్యాశాఖ నుంచి క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనలో ఉన్నారు.
రాష్ట్రంలో డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా ఇప్పటివరకు ఐదు ఫేజుల్లో అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు. దీనిలో మూడు ప్రధాన విడతలతో పాటు, రెండు ప్రత్యేక ఫేజులను చేపట్టారు.
ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.03 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్లు పొందారు. ఈ మొత్తం ప్రవేశాల ప్రక్రియ గత ఆగస్టు 18 నాటితోనే ముగిసింది. ఆ తర్వాత సుమారు రెండున్నర లక్షల దాకా సీట్లు మిగిలాయి. దీంతో, దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ విద్యాశాఖ కార్యదర్శికి టీజీసీహెచ్‌ఈ చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి లేఖ రాశారు. అయితే, ఇప్పటివరకు స్పాట్‌పై మాత్రం స్పష్టత కరువైంది.
సర్కారుపై ఆర్థిక భారం లేకుండానే..
గతంలో ఎప్పుడూ కేవలం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లోనే స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించేవారు. కానీ, గతేడాది తొలిసారిగా ప్రైవేట్‌తో పాటు సర్కారు డిగ్రీ కాలేజీల్లోనూ స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. దీనిద్వారా సుమారు 13 వేల మంది విద్యార్థులు కొత్తగా డిగ్రీలో అడ్మిషన్లు పొందారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదు. ఈ విధానంలో సీట్లు పొందే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించబోదు.
యూనివర్సిటీలు నిర్ణయించిన ఫీజులను విద్యార్థులే స్వయంగా సీట్లు పొందిన కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. ఏపీ సహా గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయిన వారి పిల్లలకు ఎక్కువగా ఉపయోగపడే చాన్స్ఉంది. విద్యాశాఖ నిర్ణయం కోసం ప్రస్తుతం వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
మొదలైన క్లాసులు..
ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం జులై నెలలోనే డిగ్రీ ఫస్టియర్ క్లాసులు ప్రారంభమయ్యాయి. చాలా కాలేజీల్లో ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ సగానికి పైగా పూర్తయింది. ఇలాంటి టైమ్‌లో స్పాట్ కౌన్సెలింగ్‌పై విద్యాశాఖ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో.. ప్రవేశాలు కోరుతున్న విద్యార్థులు ఏం చేయాలో తెలియక తీవ్ర అయోమయంలో పడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, డిగ్రీ స్పాట్ అడ్మిషన్లపై వెంటనే స్పష్టతనివ్వాలని విద్యార్థులు, పేరెంట్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.
