హైదరాబాద్ లో గణేశ్ ఆగమనాలు..ఆగమాగం..నిషేధం ఉన్నా హెవీ డీజే సౌండ్స్

హైదరాబాద్ లో గణేశ్ ఆగమనాలు..ఆగమాగం..నిషేధం ఉన్నా హెవీ డీజే సౌండ్స్
  • పటాకుల మోతతో దద్దరిల్లుతున్న నగరం 
  • గుండె జబ్బులున్నోళ్లు, పిల్లలు, వృద్ధు లకు సమస్యలు  
  •  రాంనగర్​లో యువకుడు మృతి
  • అనుమతులు లేకుండానే  ర్యాలీలతో ట్రాఫిక్ జామ్స్​  

ముషీరాబాద్/హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ప్రస్తుతం గల్లీ గల్లీలో నిర్వహిస్తున్న గణేశ్ ఆగమన వేడుకలు జనాలను పరేషాన్​చేస్తున్నాయి. కొందరు నిర్వాహకులు రూల్స్​కు విరుద్ధంగా విపరీతమైన డీజే సౌండ్లతో, కండ్లు ఎఫెక్ట్​అయ్యేలా బీమ్​లైటింగులతో, అనుమతులు లేకుండా భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ఆగమాగం చేస్తున్నారు. ఇవి చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఇబ్బందులను కలగజేస్తున్నాయి.  ఇంట్లో పెంచుకునే కుక్కలు డీజే సౌండ్​కు బెదిరిపోతున్నాయి. నడిరోడ్డుపైనే డీజేలతో గంటల తరబడి డ్యాన్సులు చేస్తూ ఉంటుండడంతో మెయిన్​రోడ్లపై ట్రాఫిక్ జామ్స్​కు కారణమవుతోంది. దీంతో అత్యవసర పనులపై వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రిళ్లు కూడా భారీగా పటాకులు కాలుస్తుండడంతో జనాలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. 

రెండేండ్ల నుంచి డీజేలపై నిషేధం..

రాష్ట్రంలో మతపరమైన ఊరేగింపులు, పండుగల సమయాల్లో హై-డెసిబెల్ డీజే సౌండ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ల వాడకంపై పూర్తి నిషేధం ఉంది. ధ్వని కాలుష్యం, ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్ల క్రితం నిషేధం విధించింది. వినాయక చవితి, నిమజ్జనాలతో పాటు మిలాద్-ఉన్-నబీ వంటి అన్ని రకాల మతపరమైన ఊరేగింపులలో డీజేలు, సౌండ్ వాల్స్, మల్టీ-స్పీకర్ సెటప్‌‌‌‌‌‌‌‌లను ఉపయోగించవద్దని స్పష్టంగా ప్రకటించారు. వినాయక మండపాల్లోనూ కేవలం పరిమిత బాక్స్ స్పీకర్లు మాత్రమే నిర్ణయించిన శబ్ద పరిమితి లోపల వాడుకోవడానికి అనుమతిచ్చారు. ఇక రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఎలాంటి లౌడ్‌‌‌‌‌‌‌‌స్పీకర్లు కూడా వాడకూడదు. దవాఖానలు, విద్యాసంస్థలు, కోర్టులకు 100 మీటర్ల పరిధిలో సౌండ్​సిస్టమ్స్​పై పూర్తి నిషేధం అమల్లో ఉంది. ఒకవేళ ఉల్లంఘిస్తే డీజే ఆపరేటర్లతో పాటు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. 

అర్ధరాత్రి పటాకుల మోత

దేశవ్యాప్తంగా పటాకులు కాల్చడంపై సుప్రీం కోర్టు కొన్ని స్ట్రిక్ట్​రూల్స్​విధించింది. దీని ప్రకారం దీపావళి కాకుండా మామూలు రోజుల్లో రాత్రివేళ అస్సలు పటాకులు కాల్చకూడదు. సాధారణ రోజుల్లో లేదా శుభకార్యాల టైంలో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు పూర్తి నిషేధం ఉంది. వీటిని పర్యవేక్షించాల్సిన బాధ్యతను సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక పోలీసులకు అప్పగించింది. అయితే, నగరంలో ఆగమనం పేరిట అర్ధరాత్రి వేళల్లో పటాకుల మోత మోగిస్తున్నారు. సుత్లీ బాంబ్ (110 నుంచి 145 డెసిబెల్స్ ) 1000 వాలా, 5000 వాలా, 10000 వాలా (123 డెసిబెల్స్), మల్టీషాట్​స్కై షాట్స్, పెద్ద సౌండ్ రాకెట్లు పేలుస్తుండడంతో నగర జనాలు నిద్రపోలేక సతమతమవుతున్నారు.  

పోలీసులు పట్టించుకోవట్లే.. 

నిషేధం ఉన్నా నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా డీజేలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఇదంతా పోలీసులకు తెలిసే జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. చాలా మంది డీజేలు మోగుతుంటే తమ గుండెల్లో దడ పుడుతోందని, ఏమవుతుందోనన్న భయం కలుగుతోందంటున్నారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి 12 గంటల తర్వాత అందరూ పడుకున్న వేళలో ఈ డీజేల మోత కలవరపాటుకు గురి చేస్తున్నది. 112కు కాల్​చేస్తే వచ్చి పోలీసులు వచ్చి డీజే ఆపించకుండా నిర్వాహకులను బతిమిలాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. 

అమ్మో 100 నుంచి 120

టీజీపీసీబీ, సీపీసీబీ రూల్స్​ప్రకారం ఇండ్లున్న ప్రాంతాల్లో పగటి పూట 55 డెసిబెల్స్, రాత్రి పూట 45 డెసిబెల్స్ మించకూడదు. వాణిజ్య ప్రాంతాల్లో అయితే పగటి పూట 65, రాత్రి 55 డెసిబెల్స్ దాటకూడదు. ఇక సైలెంట్​జోన్లయిన దవాఖానలు, స్కూల్స్​చుట్టూ 100 మీటర్ల పరిధిలో పగటి పూట 50 డెసిబెల్స్, రాత్రి 40 డెసిబెల్స్ మాత్రమే ఉండాలి. కానీ, విగ్రహ ఆగమనోత్సవాల్లో వినియోగిస్తున్న డీజేల శబ్దం ఏకంగా 100 నుంచి 120 డెసిబెల్స్ వరకు ఉంటోంది. ఇది నిర్ణీత పరిమితి కంటే రెట్టింపు స్థాయి కావడం గమనార్హం. 

గుండె జబ్బులు, బీపీ 

భారీ శబ్దాలు వినిపించినప్పుడు మనుషుల్లో సడన్‌‌‌‌‌‌‌‌గా ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల ఒక్కసారిగా బీపీ పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు పెరుగుతుంది. ముషీరాబాద్‌‌‌‌‌‌‌‌లో వ్యక్తి మృతి చెందడానికి ఇదే ప్రధాన కారణమని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. నిరంతరం వచ్చే ఈ శబ్ద కాలుష్యం వల్ల నిద్రలేమి, తీవ్ర తలనొప్పి, చిరాకు, ఆందోళన వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.

రామ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఆగమన వేడుకల్లో మృతి  
కొద్ది రోజుల కింద ముషీరాబాద్​ పరిధిలోని రామ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో గణేశ్ ​విగ్రహ ఆగమన వేడుకలు నిర్వహించారు. దీని కోసం నిర్వాహకులు వాట్సాప్ గ్రూపుల్లో విపరీత ప్రచారం చేశారు. ఎక్కువ సంఖ్యలో రావాలని ప్రకటనలు ఇవ్వడంతో వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. రాంనగర్ చౌరస్తాలో శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగమనం కోసం భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఇందులో పాల్గొన్న బద్రీనాథ్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ పాల్గొని ​ఉత్సాహంగా డ్యాన్సులు చేశాడు. అదే టైంలో భారీగా పటాకులు కాల్చడం, డీజే హోరుతో హార్ట్​ ఎటాక్​ వచ్చింది. దీంతో కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. 

చెవుడొస్తది..
మనుషుల చెవులు సాధారణంగా 60 నుంచి 70 డెసిబెల్స్ వరకు శబ్దాన్ని మాత్రమే తట్టుకోగలవని, అంతకంటే ఎక్కువ శబ్దం కంటిన్యూగా, లేదా ఆకస్మికంగా ఉంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 85 డెసిబెల్స్ దాటిన శబ్దానికి ఎక్కువ సేపు గురైతే క్రమంగా వినికిడి శక్తి మందగిస్తుందంటున్నారు. 110 నుంచి 120 డెసిబెల్స్ ఉండే చెవి పొరలు దెబ్బతినే (ఇయర్ డ్రమ్ రెప్యూటర్ ) ప్రమాదం ఉందంటున్నారు. ఒక్కోసారి శాశ్వతంగా చెవుడు వచ్చే అవకాశం ఉంటుందని ఈఎన్‌‌‌‌‌‌‌‌టీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.