హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. గురువారం అసెంబ్లీలో జరిగిన ఈ భేటీలో టీజీఈజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ రాజశేఖర్ ఉద్యోగ వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ నివేదికను తెప్పించుకుని తక్షణమే అమలు చేయాలని, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఉద్యోగుల సమస్యల పట్ల సీఎం సానుకూలంగా స్పందించారని నేతలు వెల్లడించారు. వచ్చే సోమవారం జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశాలన్నింటిపై సమగ్రంగా చర్చించి, డిమాండ్ల అమలుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని జేఏసీ కోరింది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. సీఎం కలిసిన వారిలో టీజీటీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాములు, రమేశ్, టీజీఆర్ఎస్ఏ అధ్యక్షుడు రాంరెడ్డి, జీపీఓఏటీజీ అధ్యక్షుడు ఉపేంద్రరావు ఉన్నారు.
