లాల్ మందిర్ వద్ద పేలుడుకు కుట్ర..భారీ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ తో ఎర్రకోటకు మార్పు..ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏ చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌ లో విస్తుపోయే నిజాలు

లాల్ మందిర్ వద్ద పేలుడుకు కుట్ర..భారీ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ తో ఎర్రకోటకు మార్పు..ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏ చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌ లో విస్తుపోయే నిజాలు
  • నూహ్‌‌‌‌‌‌‌‌లో అద్దె గదిలో బాంబు తయారు చేసిన నబీ
  • 2023 నుంచి 2025 మధ్య ఎర్రకోట వద్ద 12 సార్లు రెక్కీ  

న్యూఢిల్లీ: గతేడాది దేశ రాజధాని ఢిల్లీని వణికించిన ఎర్రకోట బాంబు పేలుడు ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏ) దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు మొదట రద్దీగా ఉండే లాల్ మందిర్(జైన దేవాలయం) వద్దే బాంబు పేల్చాలని పథకం పన్నారని.. అయితే, చివరి నిమిషంలో ట్రాఫిక్ కారణంగా ఆ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను మార్చుకుని ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడ్డారని ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏ చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌లో స్పష్టం చేసింది. నవంబర్ 10, 2025న జరిగిన ఈ పేలుడులో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కుట్ర వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి, డాక్టర్ ఉమర్ ఉన్ నబీ నూహ్‌‌‌‌‌‌‌‌లోని ఒక అద్దె గదిలో ఉంటూ ఈ పేలుడు పదార్థాలను తయారు చేసినట్టు దర్యాప్తులో తేలింది.

యూరియా నుంచి బాంబు తయారీ..

ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏ చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌లో  పేర్కొన్న వివరాల ప్రకారం. .నిందితులు పెన్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌లలో భద్రపరిచిన పీడీఎఫ్‌‌‌‌‌‌‌‌ల ఆధారంగా బాంబు తయారీ రహస్యాలు బయటపడ్డాయి. యూరియా నైట్రేట్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించి పేలుడు పదార్థాలు తయారు చేసే పద్ధతులతో పాటు, ఏకంగా మూత్రం నుంచి యూరియాను వేరు చేసే మరో పద్ధతిని కూడా నబీ ఆచరణలో పెట్టాడు. నబీ నివసించిన గదిలో మూత్రంతో నిండిన పాలీబ్యాగ్‌‌‌‌‌‌‌‌లు ఉండటం, దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అతడి స్నేహితుడికి ఫిర్యాదు చేసినట్టు సాక్ష్యాలు సేకరించారు.

ట్రాఫిక్ అడ్డురావడంతోనే మలుపు

నబీ ఐ20 కారులో పేలుడు పదార్థాలను నింపుకుని సన్హరీ మసీద్‌‌‌‌‌‌‌‌ పార్కింగ్ నుంచి సాయంత్రం 6:37 గంటలకు బయలుదేరాడు. మొదటగా ప్లాన్– ఎ ప్రకారం లాల్ మందిర్ వద్దే కారును పార్క్ చేసి పేలుడుకు యత్నించాడు. కానీ, అక్కడ విపరీతమైన ట్రాఫిక్, పోలీసుల భద్రత ఎక్కువగా ఉండటంతో వెనుదిరగాల్సి వచ్చింది. అక్కడి నుంచి యూ-టర్న్ తీసుకున్న నబీ, తన లక్ష్యాన్ని ఎర్రకోట వైపు మార్చాడు. సరిగ్గా కొన్ని నిమిషాల వ్యవధిలోనే, సాయంత్రం 6:50 గంటలకు కారు పేలింది. ఈ దాడి కేవలం యాదృచ్ఛికం కాదని, దీని వెనుక పెద్ద కుట్రే ఉందని ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏ తేల్చింది. 2023 నుంచి 2025 మధ్య కాలంలో నబీ ఏకంగా 12 సార్లు ఎర్రకోట పరిసర ప్రాంతాలను  సందర్శించినట్టు గుర్తించారు. ఇది పూర్తిగా రెక్కీలో భాగమేనని ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏ చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌లో స్పష్టం చేసింది.