- త్వరలోనే చర్యలు చేపడుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- రాష్ట్రంలోని 34 లక్షల వ్యవసాయ పంపు సెట్లు,
- గృహాలకు సోలార్ పవర్ అందిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సంప్రదాయేతర ఇంధన వనరులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలోనే చర్యలు చేపడుతోందన్నారు.
గురువారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్యేలు కె.మదన్ మోహన్, కసిరెడ్డి నారాయణరెడ్డి వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల, కొమురంభీం, పాలేరు, వైరా, మల్లన్నసాగర్, ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, పోచారం వంటి జలాశయాలలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద మెగావాట్‌కు రూ.కోటి వరకు సహాయం అందించే పథకాన్ని ప్రకటించినప్పటికీ అందులో కొన్ని ఇబ్బందులు ఉ న్నాయన్నారు. ప్రధానంగా దేశీయంగా తయారైన పరికరాలనే ఉపయోగించాలనే కేంద్ర నిబంధనల కారణంగా మెగావాట్‌కు రూ.1.30 కోట్ల వరకు అదనపు భారం పడుతోందని వివరించారు.
కేంద్రం విధించిన నిబంధనలను సడలిస్తే ఫ్లోటింగ్ సో లార్ ప్రాజెక్టులపై పెట్టుబడిదారుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 34 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, గృహాలకు సోలార్ పవర్ అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఏడాదికి రూ.19 వేల కోట్ల సబ్సిడీ..
వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.14 వేల కోట్ల సబ్సిడీ భరిస్తోందని డిప్యూటీ సీఎం చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా సుమారు 55 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కల్పిస్తున్నామన్నారు.
దీనికి మరో రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు అవుతోందన్నారు. ఏటా విద్యుత్ సబ్సిడీల కోసం రూ.19 వేల కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఈ భారాన్ని తగ్గించుకుంటూనే ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సోలార్ విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నామని వివరించారు.
మండల స్థాయిలోనే మైక్రో గ్రిడ్స్ ఏర్పాటు చేస్తం..
అమ్రాబాద్ గిరిజన ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని భట్టి విక్రమార్క వెల్లడించారు. సుమారు 80 గ్రామాలను పూర్తిగా సోలరైజ్ చేసి, అక్కడ మండల స్థాయిలోనే మైక్రో గ్రిడ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇండ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి, మైక్రో గ్రిడ్ ద్వారా విద్యుత్ వినియోగించే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద గతంలో పంపిణీ చేసిన సుమారు 6.70 లక్షల ఎకరాలను కూడా సౌర విద్యుత్ ప్రోత్సాహానికి వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పేరుతో పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతులు, ప్రజలు సౌర విద్యుత్ ఉత్పత్తిపై అవగాహన పెంచుకోవాలని భట్టి కోరారు. తమ తమ గ్రామాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రైతులకు ఎమ్మెల్యేలు అవగాహన కల్పించాలని సూచించారు.
ఉద్యోగులకు రూ.కోటి బీమా..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లకు అందిస్తున్న రూ.కోటి బీమా పథకం దేశంలోనే తొలిసారని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ప్రమాద బీమాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 16 బ్యాంకులతో ఒప్పందం చేసుకుందన్నారు.
రాష్ట్రంలో మొత్తం 12,91,056 మంది ఈ పథకం పరిధిలో ఉన్నట్లు వివరించారు. వీరిలో 5,18,293 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 5 లక్షల 158 మంది తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్, మల్టీపర్పస్ వర్కర్లు, కాంట్రాక్ట్, డైలీవేజ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఎంటీఎస్, సెర్ప్ తదితర సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. 2,72,600 మంది పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు ఉన్నారని తెలిపారు.
మొదట సింగరేణిలో అమలు..
ఉద్యోగుల కోసం రూ.కోటి బీమా పథకానికి మొదట సింగరేణి కాలరీస్‌లో శ్రీకారం చుట్టినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ పరిధిలోని డిస్కమ్‌లు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పథకాన్ని విస్తరించినట్లు చెప్పారు.
చివరగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తించేలా చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న బ్యాంకులతో ప్రభుత్వం చర్చలు జరిపి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల జీతాలు తమ బ్యాంకుల ద్వారా జమ అవుతున్నందున, బ్యాంకులకు వ్యాపారపరంగా ప్రయోజనం కలుగుతున్న నేపథ్యంలో బీమా పథకానికి బ్యాంకులే సహకరించేలా ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.
ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి బీమాతో పాటు ఇతర ప్రయోజనాలు కలిపి రూ.1.20 కోట్ల వరకు ప్రయోజనం అందేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. విమాన ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగితే రూ.2 కోట్ల వరకు, సహజ మరణానికి రూ.10 లక్షల వరకు ప్రయోజనం కల్పించే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
