- స్టీల్‌ను కూడా తక్కువ ధరకే అందించేలా చర్యలు: మంత్రి పొంగులేటి
- ఉన్న ప్రాంతంలోనే ఇండ్లు ఇస్తున్నం.. బయటి వాళ్లకు డ్రాలో వస్తే తొలగిస్తం
- అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో వివరించిన హౌసింగ్ మంత్రి
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అత్యంత కీలకమైన సిమెంట్ బ్యాగును పేదలకు రూ.230కే అందిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సిమెంట్ కంపెనీలతో చర్చలు జరిపామని చెప్పారు.
ప్రస్తుతం మార్కెట్లో రూ.310 నుంచి రూ.320 ఉన్న 50 కిలోల సిమెంట్ బ్యాగ్‌ను రూ.230కే పేదలకు అందించేలా ఒప్పందం పూర్తి చేశామని, త్వరలో ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. స్టీల్‌ను కూడా తక్కువ ధరకు అందించే దిశగా చర్యలు చేప డుతున్నామని తెలిపారు. పేదల ఆత్మగౌరవాన్ని కాపా డుతూ వారు నివసించే ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇం డ్లను నిర్మించి ఇవ్వాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
పేదలను వారి జీవనోపాధికి దూరంగా 30- నుంచి 40 కిలోమీటర్ల అవతలికి పంపించే విధానం తమ ప్రభుత్వానికి లేదన్నారు. ఎకరం రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు విలువ చేసే ప్రాంతాల్లో కూడా పేదవాళ్ల ఆత్మగౌరవానికి తగినట్లుగా ఇండ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు.
గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లపై ఆయన మాట్లాడారు. ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు డ్రాలో ఎంపికైనట్లు తేలితే వారి పేర్లను తప్పనిసరిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. దేశంలోనే ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షలు మన రాష్ట్రంలోనే అందిస్తున్నామని చెప్పారు. రూ.5 లక్షలు సరిపోవడం లేదని పలువురు సభ్యులు సూచించారని, ఆ అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపారు.
దశాబ్దాలుగా గుడిసెల్లోనే జీవిస్తున్న పేదలకు రెండో విడతలో శుభవార్త అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన సుమారు 59 వేల గుడిసెలను రెండో విడతలో ప్రాధాన్యతగా తీసుకుని ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలోని 20 నియోజకవర్గాల్లో పైలట్ మోడల్‌లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.
వచ్చే ఏడాది బోనాల పండుగ నాటికి హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్‌లో గృహప్రవేశాలు జరిగేలా కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఇతర కార్పొరేషన్లలోనూ ఇదే విధానాన్ని పైలట్ మోడ్‌లో అమలు చేస్తున్నామని, అవసరమైతే మున్సిపాలిటీల్లోనూ పరిశీలిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
8 లక్షల ఇండ్లు.. రూ.40 వేల కోట్లు
రెండు విడతల్లో 8 లక్షల ఇండ్ల కోసం ప్రభుత్వంపై రూ.40 వేల కోట్ల భారం పడుతున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొదటి విడతలో మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లకు సుమారు రూ.22,500 కోట్లు, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లకు సుమారు రూ.11 వేల కోట్లు, పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇళ్లకు సుమారు రూ.5,500 కోట్లు అవసరమవుతాయని వివరించారు.
భవిష్యత్తులో మూడో, నాలుగో విడతల్లోనూ అర్హులైన పేదలకు ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మొదటి విడతలో ప్రభుత్వ అనుమతులతో ఇళ్లు ప్రారంభించి, నిర్మాణంలో చిన్నచిన్న లోపాల కారణంగా నిలిచిపోయిన సుమారు 3,200 ఇళ్లను రాటిఫై చేసి క్లియర్ చేశామని తెలిపారు.
వారందరికీ ఈ వారం చివర్లోనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో రాజకీయ వివక్షతో ఇళ్ల కేటాయింపులు జరిగాయని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష సభ్యులు సూచించిన అర్హులైన పేదల పేర్లను కూడా పరిశీలించి, అనుమతులు ఇచ్చామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో పూర్తికాని డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రజా ప్రభుత్వం రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు.
గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా వదిలిన ఇళ్లకు సుమారు రూ.750 కోట్ల బిల్లులు చెల్లించామని చెప్పారు. ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని, డ్వాక్రా మహిళా సంఘాల్లో సభ్యులైన పేదలకు రూ.లక్ష అడ్వాన్స్‌గా అందించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.
