- మూసీ జన్ ఆందోళన్
ముషీరాబాద్, వెలుగు: మూసీ పునర్జీవం పేరుతో పకృతిని ధ్వంసం చేస్తున్నారని మూసీ జన్ ఆందోళన్ ఆందోళన వ్యక్తం చేసింది. సుందరీకరణకు వ్యతిరేకం కాదని, ఎత్తయిన భవనాలు, వంతెనలు, రోడ్ల నిర్మాణానికే వ్యతిరేకమని పేర్కొంది. మూసీ జన్ ఆందోళన్ ఆధ్వర్యంలో పీవోడబ్ల్యూ సంధ్య అధ్యక్షతన గురువారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మూసీ కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మహా ధర్నా చేపట్టారు.
పర్యావరణవేత్తలు బ్రదర్ వర్గీస్ తెక్కనాథ్, దొంతి నరసింహారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సీనియర్ ఎడిటర్ కె.శ్రీనివాస్, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు సజయ, జీవన్, శంకర్, ఝాన్సీ, కన్న గంటి రవి తదితరులు హాజరయ్యారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చివేయొద్దన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రాంతీయ భాషలో ప్రచురించి, అన్ని వర్గాలతో సంప్రదింపులు జరపాలని కోరారు. కొత్త నిర్మాణాలను నిలిపివేయాలని, కాలుష్య కారకాల వద్దే నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. మూసీ పరివాహక ప్రాంతానికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలన్నారు. గతంలో మూసీ పునరుద్ధరణకు ఖర్చు చేసిన నిధులపై ఆడిట్ నిర్వహించాలని కోరారు.
