హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అర్హులైన ప్రతి దివ్యాంగుడికి పింఛన్ అందిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గురువారం శాసనమండలిలో దివ్యాంగుల పింఛన్ల మంజూరుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,66,351 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారని తెలిపారు. అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించామని, దరఖాస్తుల స్వీకరణకు 2026 సెప్టెంబర్ 15 చివరి తేదీగా నిర్ణయించినట్టు వెల్లడించారు.
ఇప్పటివరకు 1,23,199 దరఖాస్తులు అందగా, ప్రస్తుతం అవి వెరిఫికేషన్ ప్రక్రియలో ఉన్నాయని, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులైన వారికి మంజూరు చేస్తామని చెప్పారు. సదరం, యూడీఐడీ సర్టిఫికెట్ల జారీ ఆలస్యం కాకుండా తాత్కాలిక సర్టిఫికెట్లు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నామని, హార్ట్ పేషెంట్లకు సైతం పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు మంజూరైన పింఛన్లను తొలగిస్తున్నామని, పింఛన్ల మంజూరులో అర్హతే ప్రామాణికమని సీతక్క స్పష్టం చేశారు.
