- ధరణి అక్రమాలు ఆధారాలతో వివరిద్దాం
- సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్
- కొందరు ఎమ్మెల్యేల తీరుపై అసహనం
- ప్రజలకు దూరంగా ఉంటే ‘వన్‌టైమ్ వండర్’గా మిగులుతారన్న సీఎం
- ఈ రెండున్నరేండ్లు కీలకం: పీసీసీ చీఫ్
- ఐక్యంగా పనిచేసి ప్రతిపక్షానికి మన సత్తా చూపాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: 22ఏ నిషేధిత భూములపై వాస్తవాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 22ఏలో కోటి ఎకరాలు అంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, వాస్తవానికి అందులో ఉన్నది కేవలం 3.06 లక్షల ఎకరాలే అని చెప్పారు. మిగితా భూమి అంతా అటవీ, ప్రభుత్వానికి చెందినదేనని వివరించారు. సభ ముగిసిన అనంతరం అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ ) సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా సాధించిన పాలనా విజయాలను, సంక్షేమ ఫలాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సభను సజావుగా సాగనీయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షం సాగిస్తున్న కుట్రలను నిర్మాణాత్మక చర్చలతోనే తిప్పికొట్టాలని శాసనసభ్యులకు సీఎం దిశానిర్దేశం చేశారు. కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. సభలో చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై దాడి చేస్తున్నప్పుడు..
ఎదురుదాడికి దిగకుండా మౌనంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రజలకు దూరంగా ఉండే ఎమ్మెల్యేలు ‘వన్‌టైమ్ వండర్’గా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో ప్రజలతో ఎమ్మెల్యేల అనుబంధం కీలకంగా ఉంటుందని స్పష్టం చేశారు. అతిగా వ్యవహరించే, ప్రజలకు దూరంగా ఉండే నేతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
సభ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ఎమ్మెల్యేలంతా విధిగా సభలో ఉండాలని సీఎం ఆదేశించారు. సభలో హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలని అన్నారు. దళిత అంశంపై కాంగ్రెస్ శ్రేణులు ఇచ్చిన బలమైన స్పందనను సీఎం అభినందించారు. ముఖ్యంగా ఎస్సీ విభాగం, పార్టీ సోషల్ మీడియా బృందాల పనితీరును ప్రశంసించారు. కాగా, అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ఇప్పుడు సభలో హుందాతనం లేకుండా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నేతల తీరును ప్రజలే గమనిస్తున్నారని స్పష్టం చేశారు. పదేండ్లలో ధరణిని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నేతలు చేసిన అక్రమాలను ఆధారాలతో సహా సభకు వివరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి శాఖలో కలపడంపై ప్రజల్లో ఉన్న అపోహలపై సభలో స్పష్టత ఇద్దామని అన్నట్టు సమాచారం.
‘సర్’లో చురుగ్గా పాల్గొనాలి..
‘సర్’ ప్రక్రియలో ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొనడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ సానుభూతి ఓట్లు కోల్పోతే వచ్చే ఎన్నికల్లో మీకే నష్టం అనే విషయాన్ని గుర్తించి, ఇప్పటినుంచైనా ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. ‘‘నేను ఈ ప్రోగ్రాం కోసం రెండు రోజులు కొడంగల్‌లోనే ఉన్నా.. అందరూ ఇదే విధంగా ‘సర్’ పై ఫోకస్ పెట్టాలి” అని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. సభ సజావుగా జరగకుండా ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే బీఆర్‌ఎస్ నేతలు కుట్ర చేశారని ఆరోపించారు. అధికారం పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులను, ప్రజా ప్రతినిధులను దూషించి, మూడు రోజులు సభను సజావుగా జరగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. అధికారులపై అనుచితంగా వ్యవహరించడం, మహిళా అధికారుల ముందు టీషర్టులు విప్పి ఇబ్బంది కలిగించడంపై ఫైర్ అయ్యారు.
ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకుసాగాలి: భట్టి
కలిసి పనిచేస్తే కుట్రలను ఎలా ఛేదించగలమో మనం చూపించామని ఎమ్మెల్యేలనుద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ నాయకుల తీరు, వారి భాష, శుద్ధీకరణపై సభ్యులందరం గట్టిగా నిలదీసి కట్టడి చేయగలిగామన్నారు. ‘‘మనమంతా ఒకటే మాట.. ఒకటే బాటగా.. ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి’’ అని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు.
‘‘మనం చేసుకోవాల్సిన ప్రచారం సరిగ్గా చేసుకోకపోవడం వల్లే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టవుతున్నది. మనం సరైన విధంగా, మనం చేసిన వాటిని ప్రచారం చేసుకుంటే ఆ ప్రవాహంలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయి. సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలకు తెలియజేయాలి” అని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 27 లక్షల మంది విద్యార్థులకు హైజెనిక్ బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నామని చెప్పారు.
చిన్న పొరపాటు లేకుండా కులసర్వే నిర్వహించి అసెంబ్లీలో ఆమోదించుకొని కేంద్రానికి పంపామన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమాను అమలు చేయబోతున్నట్టు వెల్లడించారు. ఉద్యోగులకు కోటి రూపాయల బీమా అందిస్తున్నామన్నారు. ‘‘మనం చేసిన పనులే మనల్ని గెలిపిస్తాయి. ప్రజా ప్రభుత్వం చేసిన పనులపై ప్రతి గ్రామంలో ఇంటింటికీ ప్రచారం చేయాలి. మన సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు చాలా సంతృప్తిగా ఉన్నారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
‘సర్’పై అలర్ట్‌గా ఉండాలి: పీసీసీ చీఫ్ మహేశ్
వచ్చే రెండున్నరేండ్ల మనకు అత్యంత కీలకం అని ఎమ్మెల్యేలతో పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అన్నారు. దేశంలో ‘సర్’ ప్రక్రియ దుర్మార్గంగా సాగుతోంది.. బీజేపీ వ్యతిరేక ఓట్లను అన్యాయంగా తీసేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు సమీక్ష చేశారు. పెద్ద సంఖ్యలో ఓట్లు పోతున్నాయి. దళితులు, గిరిజనుల ఓట్లనే ఎక్కువగా తొలగిస్తున్నారు. ఎమ్మెల్యేలు ‘సర్’ ప్రకియపై అలర్ట్‌గా ఉండాలి. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా అమలవడం లేదు. తెలంగాణలోనే సామాజిక న్యాయం జరుగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ కాకపోయినా.. బీసీ రిజర్వేషన్ల కోసం ముందుకు వచ్చారు. కానీ వీటి అమలు కోసం కేంద్రం సహకరించలేదు” అని పేర్కొన్నారు.
వివిధ అంశాలను వివరించిన మంత్రులు
సాంకేతిక విద్యా రంగాన్ని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పాలిటెక్నిక్ కాలేజీలను ఇంధన (శక్తి) శాఖ పరిధిలోకి అనుసంధానించడంపై నెలకొన్న సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయనున్న ది. సంప్రదాయ పద్ధతుల నుంచి గ్రీన్ ఎనర్జీ, సోలార్, అత్యాధునిక పవర్ సెక్టార్ దిశగా విస్తరిస్తున్న మార్కెట్ అవసరాలకు సరిపడా మానవ వనరులను సిద్ధం చేయడమే ఈ విలీనం ముఖ్య ఉద్దేశమని మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశంలో వివరించారు.
ఈ విధానపరమైన మార్పుపై ప్రజల్లో, విద్యార్థుల్లో ఉన్న అపోహలను అసెంబ్లీ వేదికగా విడమరిచి చెప్పాలని సీఎం సూచించారు. మరోవైపు ఎల్-నినో పరిస్థితులు, వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగు, సాగునీటి నిర్వహణ ప్రణాళికలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎల్పీలో విస్తృతంగా వివరించారు. ముందస్తు వ్యూహంతో ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను కాపాడుకుంటూ రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను సభ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ స్పష్టమైన, కఠినమైన వైఖరి అవలంబించాలని అన్నారు.
బీసీ కులగణన అంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తావించారు. ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై తీర్మానం చేసి తదుపరి ప్రక్రియలో భాగంగా ముందుకు పంపాలని సూచించారు. జనగణనలో బీసీ కాలమ్ పెట్టాలన్న డిమాండ్‌ను వినిపించారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. తన 20 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంతటి ప్రతిపక్ష తీరును ఎప్పుడూ చూడలేదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ప్రభుత్వం దీటుగా ఎదుర్కొన్నదని చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దేశానికి రోల్ మోడల్‌గా మన జనగణన
స్పీకర్‌ను బీఆర్‌ఎస్ నేతలు అత్యంత అభ్యంతరకరంగా దూషించారని, నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధిచేసి అవమానించారని సీఎం రేవంత్ రెడ్డి మండిప డ్డారు. ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పికొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు తెలియజేసినందుకు ఎమ్మెల్యేలందరినీ అభినందించారు. జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టినట్టు చెప్పారు. కొందరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగి.. కాంగ్రెస్‌కే నష్టం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
సబితా ఇంద్రా రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ అవకాశం ఇవ్వకుంటే వారు రాష్ట్రస్థాయి నేతలుగా ఎదిగేవారా? అని సీఎం ప్రశ్నించారు. పోలీస్ సిబ్బందిని చూడగానే కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి కనిపించినట్టున్నారని, అందుకే అంత ఆక్రోశంతో వారిపై దాడులు చేశారని అన్నారు. దేశానికి మనం చేసిన జనగణన రోల్ మోడ ల్‌గా నిలిచిం దని, ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత అని ప్రశంసించారు. తెలంగాణ నమూనాలో జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా తేల్చారని, కానీ ఓటర్ల జాబితా మాత్రం 88 కోట్లుగా చూపుతున్నారన్నారు. ఈ లెక్కన దేశంలో 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని, దీంతో ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెయ్యి రోజుల ప్రజా పాలనకు సహకరించి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
