హోటళ్లలో టీజీ సేఫ్ తనిఖీలు..ఏడు సంస్థల లైసెన్సులు రద్దు

హోటళ్లలో టీజీ సేఫ్ తనిఖీలు..ఏడు సంస్థల లైసెన్సులు రద్దు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలపై టీజీ సేఫ్ కొరడా ఝుళిపించింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, లక్డీకాపూల్ ప్రాంతాల్లోని 21 ఫుడ్ సెంటర్లలో 10 ఎన్‌ ఫోర్స్‌మెంట్ టీమ్ లు తనిఖీలు చేపట్టగా.. తీవ్రమైన అపరిశుభ్రత, ఎలుకలు, బొద్దింకల బెడద, ఫ్రిజ్‌ లలో నిల్వ ఉంచిన కుళ్లిన మాంసం, కూరగాయలు బయటపడ్డాయి. దీంతో రూల్స్ ఉల్లంఘించిన బంజారాహిల్స్‌లోని లక్ష్మీ శ్రీ బాలాజీ స్వీట్స్ అండ్ బేకరీ, గర్ల్ ఫ్రెండ్ మండి, ఖోలానీస్ ఫైన్ డైన్ రెస్టారెంట్, కాకతీయ టిఫిన్స్ మీల్స్ అండ్ స్నాక్స్ సంస్థల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేసి మూసివేయించారు. ఇదే ప్రాంతాల్లో తీవ్ర లోపాలున్న కాసా లబాన్, సర్వీ ఫుడ్ కోర్ట్ సహా నాలుగు హోటళ్లకు షోకాజ్ నోటీసులు, మరో ఎనిమిది సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. అలాగే, అనుమానంతో 13 ఫుడ్ శాంపిల్స్‌ ను ల్యాబ్‌ కు తరలించారు.

జిల్లాల్లోనూ ఉల్లంఘనలు.. 

రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని 46 హోటళ్లు, దాబాల్లోనూ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అపరిశుభ్రంగా నిర్వహిస్తున్న స్టేషన్ ఘన్‌పూర్‌ లోని మహేంద్ర మీల్స్ అండ్ బిర్యానీ, కరీంనగర్ బావుపేటలోని శ్రీ బాలాజీ మ్యాజిక్ మిఠాయి, చౌటుప్పల్ తుప్రాన్‌ పేట్‌ లోని చా చా ఫ్యామిలీ దాబా లైసెన్సులను రద్దు చేశారు. జిల్లాల పరిధిలోని మరో 23 ఆహార కేంద్రాలకు లోపాలు సరిదిద్దుకోవాలని నోటీసులు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో పట్టుబడ్డ బూజు పట్టిన కూరగాయలు, పురుగులు పట్టిన ఆహార పదార్థాలను అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. జిల్లాల నుంచి మరో 22 శాంపిల్స్ ను ల్యాబ్ పరీక్షల కోసం సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.