అనుమానంతో భార్యను చంపిన భర్త.. ఖమ్మం జిల్లాలో ఘటన

అనుమానంతో భార్యను చంపిన భర్త.. ఖమ్మం జిల్లాలో ఘటన

ఖమ్మం, వెలుగు: వివాహేతర సంబంధం అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని కారులో రోడ్డు పక్కన వదిలి పరార్ అయ్యాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఇల్లందుకు చెందిన మేడేపల్లి విద్యాసాగర్ ఖమ్మంలో కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి గతంలో వివాహం కాగా.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమెకు విడాకులు ఇచ్చాడు. 

తర్వాత చిన్నబోయిన రేణుక (33) అనే మహిళను నాలుగు నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. ఖమ్మంలోని సీసీఎస్​ పోలీస్​స్టేషన్ సమీపంలో ఇల్లు  కిరాయికి తీసుకుని ఉంటున్నారు. రేణుక  మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని విద్యాసాగర్ అనుమానిస్తుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. రేణుక, విద్యాసాగర్ కలిసి కారులో బయటకు వెళ్లారు. ఇల్లందు రోడ్డులో వెళ్తున్న సమయంలో ఇద్దరికీ మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన విద్యాసాగర్ కారులోనే రేణుకను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం హత్య విషయాన్ని ఇల్లందులోని తన ఫ్రెండ్ కు ఫోన్ చెప్పాడు. 

రేణుక డెడ్ బాడీని కారులోనే ఉంచి, కారును ఇల్లందు రోడ్డులోని ఓ ప్రైవేట్ స్కూల్ సమీపంలో పార్క్ చేసి పరార్ అయ్యాడు. ఇల్లందులోని విద్యాసాగర్ స్నేహితుడు ఖమ్మం పోలీసులకు సమాచారం ఇవ్వగా... ఫోన్​ సిగ్నల్ ఆధారంగా విద్యాసాగర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్​పోలీసులు తెలిపారు.