22ఏ భూములు విడిపించాలె ..పేదల భూములు చేర్చడం అన్యాయం : కేంద్ర మంత్రి బండి సంజయ్

22ఏ భూములు విడిపించాలె ..పేదల భూములు చేర్చడం అన్యాయం : కేంద్ర మంత్రి బండి సంజయ్
  • రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పదేండ్లు దోచుకు తిన్నది
  • నాపై 109 కేసులు పెట్టినా భయపడలే 
  • తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే
  • కేంద్ర మంత్రి బండి సంజయ్

భద్రాచలం, వెలుగు: రాష్ట్రంలో 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టిన భూములను వెంటనే విడిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పేదలు కష్టపడి కొనుక్కున్న కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టి దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్దం చేసిందని ఆరోపించారు. దీనికి అసలు సూత్రధారి మంత్రి పొంగులేటి కాదా? అని ప్రశ్నించారు. భద్రాచలంలో బుధవారం బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

కేసీఆర్ కుటుంబం పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మంత్రి, ఎమ్మెల్యేలంతా దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉందన్నారు. కాంగ్రెస్​ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని బండి సంజయ్​అన్నారు. ‘బీఆర్ఎస్​, కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినం, ఈసారి బీజేపీని గెలిపించుకుందాం’ అని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. అసలు బీఆర్ఎస్‌ను ఎదుర్కొన్నది బీజేపీనే అని, వారి కుటుంబ అవినీతిని బట్టబయలు చేశామన్నారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన తనపై109 కేసులు పెట్టారని, అయినా భయపడలేదన్నారు. ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు అయ్యారని, జిల్లాకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఒకరు సీఎంకు లెఫ్ట్, ఇంకొకరు రైట్, మరొకరు ఏకంగా సీఎం సీటుపైనే కన్నేశారని ఎద్దేవా చేశారు.  కాగా సంజయ్ బుధవారం కుటుంబ సమేతంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు.