కార్మిక సేవలన్నీ ఒకే చోట.. ఫస్ట్ టైం అడ్డా కూలీల కోసం ఆన్ లైన్ సేవలు

కార్మిక సేవలన్నీ ఒకే చోట.. ఫస్ట్ టైం అడ్డా కూలీల కోసం ఆన్ లైన్ సేవలు
  • రాష్ట్రంలోనే తొలిసారిగా ఆదిలాబాద్లో సహాయ కేంద్రం ఏర్పాటు
  • నేడు వర్చువల్ గా ప్రారంభించనున్న మంత్రి వివేక్ వెంకటస్వామి
  • అందుబాటులోకి రానున్న అన్ని రకాల ఆన్ లైన్ సేవలు
  • అడ్డా కూలీలు వేచి ఉండేందుకు సైతం సౌకర్యాల కల్పన

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కార్మికుల సంక్షేమం, హక్కులను కాపాడడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ‘కార్మిక సౌలభ్య కేంద్రం’(కార్మిక సంక్షేమ సహాయ కేంద్రం) ఏర్పాటు చేస్తోంది. రెండేండ్ల కిందే మంజూరైన ఈ కేంద్రానికి కార్మిక సంక్షేమ బోర్డు నిధుల నుంచి రూ. 35 లక్షలు విడుదల అయ్యాయి.

జిల్లా కేంద్రంలోని ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ గెస్ట్​హౌస్​ప్రాంగణంలో నిర్మించిన ఈ కేంద్రాన్ని శుక్రవారం కార్మిక, ఉపాధి, భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి వర్చువల్‌‌‌‌‌‌‌‌గా ప్రారంభించనున్నారు. భవన నిర్మాణ, అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఒకే చోట సులభంగా అందించడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

అందుబాటులో ఆన్​లైన్ సేవలు..
ప్రస్తుతం రాష్ట్రంలో కార్మికులకు ఎలాంటి సేవలు కావాలన్నా మీ -సేవ కేంద్రాలు, కార్మిక సంక్షేమ బోర్డుల ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో కార్మికుల కోసం ప్రత్యేకంగా సౌలభ్య కేంద్రం కేంద్రం ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం అవుతోంది. 

ఈ కేంద్రం ఏర్పాటైన తర్వాత కార్మికులకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట నుంచి ఉచితంగా అందించనున్నారు. భవన నిర్మాణ, ఇతర అసంఘటిత రంగ కార్మికులు కొత్తగా లేబర్‌‌‌‌‌‌‌‌ కార్డు కోసం నమోదు చేసుకోవడం, పాత కార్డులను రెన్యూవల్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడం, ప్రభుత్వం అందించే వివిధ రకాల ఆర్థిక సాయం కోసం ఇక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రమాదవశాత్తు మరణం, అంగవైకల్యం, సహజ మరణం, పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో పాటు ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ తదితర సేవల కోసం సైతం ఈ కేంద్రంలోనే దరఖాస్తులు చేసుకోవచ్చు. అదేవిధంగా కార్మికులకు వేతనాల చెల్లింపులో ఇబ్బందులు ఎదురైనా, యాజమాన్యాలతో వివాదాలు ఉన్నా, ఇతర ఎలాంటి సమస్యలు ఎదురైనా ఇక్కడ ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నారు.

అడ్డా కూలీలకు సౌకర్యంగా..
ప్రస్తుతం కార్మికులకు పట్టణాల్లోని వివిధ ప్రధాన చౌక్‌‌‌‌‌‌‌‌ల వద్ద రోడ్లపైనే అడ్డాలు ఉంటాయి. ఉదయం ఐదు గంటల నుంచే ఆయా అడ్డాల్లో కార్మికులు ఉపాధి కోసం రోడ్లపై వేచి ఉంటారు. ఎవరైనా కార్మికులను పనికి తీసుకెళ్లాలంటే ఇక్కడికి వచ్చి కూలీ మాట్లాడుకొని తీసుకెళ్తారు. వర్షాకాలం, ఎండాకాలాల్లో కార్మికులకు సరైన అడ్డా లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఆదిలాబాద్ లో నిర్మించిన కార్మిక సంక్షేమ కేంద్రం ప్రారంభం అయితే... ఇదే కార్మికుల అడ్డాగా మారనుంది. కార్మికులు రోడ్లపై గంటల తరబడి వేచి ఉండకుండా, ఈ కేంద్రానికి రావచ్చని, వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. పని అవసరమైన వారు ఇక్కడికే వచ్చి కార్మికులను తీసుకొని వెళ్లవచ్చని పేర్కొంటున్నారు.

ఉచితంగా సేవలు
రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆదిలాబాద్ లో కార్మిక సౌలభ్య కేంద్రం ఏర్పాటైంది. ఇప్పటివరకు ఎలాంటి సేవలు పొందాలన్నా కార్మికులు మీసేవకు వెళ్లి దరఖాస్తు చేసుకునే వారు. ఇప్పటి నుంచి కొత్తగా ఏర్పాటు చేసే కేంద్రంలోనే అన్ని సేవలు అందుతాయి. కార్మికులకు అడ్డాగా ఉండేలా సౌకర్యాలు కల్పించాం.

రాజలింగం, కార్మిక శాఖ అధికారి, ఆదిలాబాద్