మెదక్/యాదాద్రి, వెలుగు : మెదక్, యాదాద్రి జిల్లాల్లో రైస్ మిల్లులపై కొనసాగుతున్న విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్దాడులను వెంటనే నిలిపివేయాలని, మిల్లర్లను దొంగలుగా చిత్రీకరించడం మానుకోవాలని రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్, హమాలీ చార్జీలు, కమీషన్ బకాయిలను వెంటనే చెల్లించాలనే తదితర 13 ప్రధాన డిమాండ్లతో జిల్లా వ్యాప్తంగా మిల్లులను బంద్ చేసిన సిబ్బంది, హమాలీలు, మిల్లర్లు నల్ల కండువాలు ధరించి కలెక్టరేట్ల వద్ద మహా ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్‌లో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి తొడుపునూరి చంద్రపాల్, జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి వీరేశం, యాదాద్రిలో లీడర్లు మార్త వెంకటేశం, పసుపునూరి నాగభూషణం మాట్లాడారు.
కొద్దిమంది తప్పు చేస్తే అందరినీ బాధ్యుల్ని చేస్తూ గత 48 రోజులుగా విజిలెన్స్ దాడుల పేరుతో కేసులు నమోదు చేసి జైళ్లకు పంపడం, మానసిక క్షోభకు గురిచేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కెపాసిటీకి మించి ధాన్యాన్ని కేటాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సీఎంఆర్ బకాయిల పేరుతో 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ విధించడాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ ధాన్యాన్ని పూర్తిగా రా రైస్‌గా, రబీ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా మాత్రమే స్వీకరించాలని, 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్, స్టోరేజీ, హమాలీ చార్జీలు, కమీషన్ బకాయిలను క్వింటాలుకు రూ.150 చొప్పున చెల్లించాలని కోరారు.
ప్రభుత్వం సూచన మేరకు కోట్ల రూపాయలు వెచ్చించి మిల్లులను అప్‌గ్రేడ్ చేసినా కనీస బకాయిలు కూడా ఇవ్వకుండా సీఎంఆర్ త్వరగా ఇవ్వాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయి డిఫాల్ట్ అయిన మిల్లర్లకు లెక్కలు పూర్తిగా తేల్చి, బకాయిలను నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం కల్పించాలని, మిల్లులకు సబ్సిడీపై కరెంట్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, యాదాద్రి కలెక్టరేట్‌లోకి వెళ్లడానికి మిల్లర్లు ప్రయత్నించగా పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. అనతరం మెదక్, యాదాద్రి జిల్లాల్లో అధికారులు డీఎస్వోలు, ఇతర అధికారులకు మిల్లర్లు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు.
