అలీసాగర్ ఎత్తిపోతలకు సాగునీరు విడుదల

అలీసాగర్ ఎత్తిపోతలకు సాగునీరు విడుదల

నిజామాబాద్, వెలుగు: అలీసాగర్​లిఫ్ట్​ ఇరిగేషన్​స్కీమ్​ పరిధిలో ఉన్న ఆయకట్టుకు నీరందిందించేకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌‌రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్‌‌ జిల్లా నవీపేట మండలం కోస్లి వద్ద గల లిఫ్ట్‌‌ పంప్‌‌ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల్లేక రైతులు ఇబ్బందులు పడుతుండడంతో నీటి విడుదలకు ప్రభుత్వాన్ని ఒప్పించినట్లు చెప్పారు. పొట్టదశలో ఉన్న వరి పైరుకు నీటి కొరత లేకుండా రెండు తడుల నీరు ఇవ్వడానికి నిర్ణయించామన్నారు. ప్రస్తుతం 10 రోజుల పాటు పంప్‌‌లు నడుపుతామని వర్షాల ఆధారంగా మరో తడి అందిస్తామన్నారు. లిఫ్ట్​ బంద్​అయ్యాక బోరు బావులు వాడుకోవాలని సూచించారు. రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్​రావు, కార్పొరేషన్​ చైర్మన్లు తాహెర్, శేఖర్​గౌడ్​, డీసీసీ ప్రెసిడెంట్​ నగేశ్‌‌రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, గోవర్ధన్​రెడ్డి తదితరులు ఉన్నారు. 

‘గుత్ప’ నీటి విడుదల ప్రారంభం

నందిపేట, వెలుగు: నందిపేట మండలం సీహెచ్​కొండూర్​శివారులోని గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా బుధవారం అధికారులు నీటి విడుదలను ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆయకట్టుకు నీరు విడుదల చేసినట్లు ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో డీఈ రవికుమార్, రైతులు, కాంగ్రెస్‌‌, బీజేపీ లీడర్లు పాల్గొన్నారు.