మహిళల ఆసియా కప్ 2026 పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఇప్పటికే హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా ఉమెన్స్ టీమ్ గ్రాండ్‌గా ఫైనల్‌కు చేరుకుని ట్రోఫీ కోసం ఎదురుచూస్తోంది. సెప్టెంబర్ 13వ తేదీన జరగబోయే ఆ మహా సంగ్రామంలో ఇండియాను ముఖాముఖి ఢీకొట్టబోయే రెండో జట్టు ఏదో నేడు తేలిపోనుంది. ఆసియా కప్ రెండవ సెమీఫైనల్లో శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ జట్లు ఆమీతుమీ తేల్చుకోవడానికి మైదానంలోకి దిగుతున్నాయి.
భారత్‌తో టైటిల్ ఫైట్ కోసం బిగ్ వార్:
ఈ మ్యాచ్ కేవలం ఒక సాధారణ సెమీఫైనల్ మాత్రమే కాదు.. ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను సవాలు చేసే గోల్డెన్ ఛాన్స్.. దాంతో రెండు టీమ్స్ ఈ మ్యాచ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గ్రౌండ్ లో ఏ చిన్న పొరపాటు చేసినా ఆసియా కప్ కల చెదిరిపోతుండటంతో పాకిస్థాన్, శ్రీలంక జట్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అంతర్జాతీయ టీ20ల్లో ఈ రెండు జట్లు మధ్య రికార్డులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అత్యంత హోరాహోరీగా కొనసాగిన ఈ పోరులో రికార్డులు దాదాపు సమానంగా ఉన్నాయి. గణాంకాల పరంగా చూస్తే పాకిస్థాన్‌కు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆధిక్యం ఉంది. కానీ ప్రస్తుత ఫామ్, టోర్నీలో ఆడుతున్న తీరును బట్టి చూస్తే శ్రీలంక వైపే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
హెడ్ టు హెడ్ రికార్డులు:
* మొత్తం మ్యాచ్‌లు: 24
* పాకిస్థాన్ విజయాలు: 12
* శ్రీలంక విజయాలు: 11
* ఫలితం తేలని మ్యాచ్: 01
2026 రీసెంట్ ఫామ్.. లంకకే బిగ్ అడ్వాంటేజ్:
ఈ ఏడాది (2026) ప్రారంభంలో శ్రీలంక, పాకిస్థాన్ మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను శ్రీలంక 2–1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో లంక బ్యాటర్లు, బౌలర్లు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. చివరి మ్యాచ్‌లో మాత్రమే పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో గెలిచి పరువునిలబెట్టుకుంది. ఈ రీసెంట్ సక్సెస్ శ్రీలంక ప్లేయర్ల ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసింది.
పాత పగలు.. హైడ్రామా పాయింట్స్:
ఈ ఇరు జట్ల మధ్య ఆసియా కప్, వరల్డ్ కప్ వేదికలపై తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లు జరిగాయి.
2024 ఆసియా కప్ సెమీస్ డ్రామా: ఆసియా కప్ సెమీఫైనల్లో పాకిస్థాన్ నిర్దేశించిన 140/4 స్కోరును శ్రీలంక లాస్ట్ ఓవర్ వరకు పోరాడి 141/7తో ఛేజ్ చేసింది. 3 వికెట్ల తేడాతో పాక్‌ను దెబ్బకొట్టి ఫైనల్ కి వెళ్లింది.
వరల్డ్ కప్ రివేంజ్: ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ (116/10) అద్భుత బౌలింగ్‌తో శ్రీలంకను కేవలం 85/9 రన్స్‌కే కట్టడి చేసి 31 పరుగుల తేడాతో ప్రతీకారం తీర్చుకుంది.
ఫైనల్లో టీమిండియాను ఎదుర్కొనేది ఎవరు?:
2024 ఆసియా కప్ సెమీస్ ఫలితాన్ని పునరావృతం చేసి మళ్లీ ఫైనల్ చేరాలని, ఈసారి భారత్‌ను ఓడించి కప్పు కొట్టాలని శ్రీలంక మహిళల జట్టు పట్టుదలతో ఉంది. మరోవైపు తమకున్న ఒక్క మ్యాచ్ హెడ్-టు-హెడ్ ఆధిక్యాన్ని నిలబెట్టుకుని, పాత పగను తీర్చుకుంటూ భారత్‌తో ఫైనల్ పోరుకు సిద్ధమవ్వాలని పాకిస్థాన్ చూస్తోంది. మరి కొన్ని గంటల్లో ప్రారంభమయ్యే ఈ హై-వోల్టేజ్ పోరులో ఏ జట్టు గెలిచి టీమిండియాకు సవాల్ విసిరుతుందో చూద్దాం..
