వినేష్ ఫోగట్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ట్రయల్స్‌కు నో పర్మిషన్.. పిటిషన్ డిస్మిస్!

వినేష్ ఫోగట్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ట్రయల్స్‌కు నో పర్మిషన్.. పిటిషన్ డిస్మిస్!

Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 2026 సీనియర్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు సంబంధించి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) నిర్వహించనున్న సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేష్ దాఖలు చేసిన తాత్కాలిక పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేం: హైకోర్టు స్పష్టీకరణ: 

ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సెప్టెంబర్ 14వ తేదీన ఈ ఎంపిక పోటీలు జరగనున్నాయి. డబ్ల్యూఎఫ్ఐ నిర్దేశించిన అర్హత ప్రమాణాలను సాధించని అథ్లెట్‌కు కేవలం ఒకరి కోసమే నిబంధనలు సవరించి అనుమతి ఇవ్వడం రూల్స్ కి విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. నిబంధనలు పాటించిన మిగతా క్రీడాకారులకు ఇది తీవ్ర అన్యాయం చేయడమే అవుతుందని, ప్రత్యేక మినహాయింపు ఇస్తే ఇదొక పండోరా బాక్స్ గా మారుతుందని జస్టిస్ పేర్కొన్నారు. 

వినేష్ ఫోగట్ ప్రధాన వాదనలు:

* మాతాపితృత్వ విరామం: గర్భధారణ, ప్రసవం, పోస్ట్-పార్టమ్ రికవరీ కారణంగా తాను గత కొన్ని పోటీలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని వినేష్ కోర్టుకు తెలిపింది.

* డైరెక్ట్ సెలెక్షన్ కాదు: తాను నేరుగా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక చేయాలని కోరడం లేదని, కేవలం ట్రయల్స్‌లో పోటీపడే అవకాశం మాత్రమే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

* షోకాజ్ నోటీసులు: డబ్ల్యూఎఫ్ఐ తనపై జారీ చేసిన షోకాజ్ నోటీసుల వల్ల కూడా కొన్ని టోర్నీల్లో పాల్గొనలేకపోయానని పేర్కొంది.

తదుపరి విచారణ సెప్టెంబర్ 29కి వాయిదా: 

డబ్ల్యూఎఫ్ఐ జారీ చేసిన సర్క్యులర్ అథ్లెట్లందరికీ సమానంగా వర్తిస్తుందని, ఒకరి కోసం నిబంధనలు మార్చలేమని చెప్పిన కోర్టు వినేష్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కానీ, ప్రసవం తర్వాత మహిళా అథ్లెట్లు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేటప్పుడు స్పోర్ట్స్ పాలసీల్లో సరైన మినహాయింపులు ఉండాలా లేదా అనే ప్రధాన అంశాన్ని తేల్చేందుకు ఈ కేసు తుది విచారణను సెప్టెంబర్ 29వ తేదీకి వాయిదా వేసింది.

►ALSO READ | స్టేడియంలో తిలక్ వర్మతో వైభవ్ గొడవ.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో!