మనం తినే కూరగాయలు విషమే..విచ్చలవిడిగా పురుగు మందుల వాడకంపై అసెంబ్లీలో సభ్యుల ఆవేదన

మనం తినే కూరగాయలు విషమే..విచ్చలవిడిగా పురుగు మందుల వాడకంపై  అసెంబ్లీలో సభ్యుల ఆవేదన
  • పెస్టిసైడ్స్ పిచికారీని ఆపేలా  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
  • కల్తీ పాలను అడ్డుకోవాలి, విజయ డెయిరీని మరింత అభివృద్ధి చేయాలి
  • పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విజ్ఞప్తి
  • కూరగాయల సాగు పెంచేందుకు కృషి చేస్తున్నామన్న మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయంలో రసాయనాలు, పురుగుమందుల వాడకంపై అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుమందులు అధికంగా వాడటం వల్ల క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయన్నారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడం, కూరగాయల దిగుమతి పెరగడంతో రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం పడుతోందన్న అంశంపై ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో తగ్గుతున్న కూరగాయల సాగు విస్తీర్ణాన్ని తిరిగి పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. గతంలో రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగితే, ప్రస్తుతం అది సుమారు లక్ష ఎకరాలకు తగ్గిపోయిందన్నారు. 

ఈ ఫలితంగా 2025–26లో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ వానాకాలంలో 51 వేల సాధారణ విస్తీర్ణానికి బదులుగా 72,583 ఎకరాల్లో కూరగాయల సాగు చేసినట్లు తెలిపారు. కూరగాయల ధరలు ప్రధానంగా డిమాండ్, సరఫరాపై ఆధారపడి ఉండటం వల్ల మార్కెట్లో ధరల్లో తరచూ హెచ్చుతగ్గులు ఉంటాయని పేర్కొన్నారు. 

కూరగాయల సాగుకు భారీ రాయితీలు..

కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు నారు, మల్చింగ్, షేడ్‌‌నెట్, శాశ్వత పందిళ్లు, బిందు, తుంపర సేద్యం వంటి సదుపాయాలపై రైతులకు రాయితీ ఇస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కూరగాయల నారు, మల్చింగ్, షేడ్‌‌నెట్ కోసం రూ.20 కోట్లు, శాశ్వత పందిళ్ల కోసం రూ.8 కోట్లు, బిందు సేద్యం కోసం రూ.97 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అన్ని పంటలకు విస్తీర్ణం ఆధారంగానే రైతు భరోసా అందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని తక్షణమే పెంచేందుకు ప్రస్తుత వానాకాలంలో సుమారు లక్ష ఎకరాల్లో, రబీ సీజన్‌‌లో మరో లక్ష ఎకరాల్లో కూరగాయల సాగుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణకు అవసరమైన కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి లేకుండా, ఇక్కడే పండించిన కూరగాయలను ఇతర రాష్ట్రాలకు వెళ్లే స్థాయికి ఉత్పత్తిని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

18న దక్షిణ భారత రాష్ట్రాల  వ్యవసాయ మంత్రులతో భేటీ..

యూరియా వినియోగం పెరగడం వల్ల పురుగుమందుల వాడకం కూడా పెరుగుతుందని మంత్రి తెలిపారు. యూరియా వినియోగాన్ని సమతుల్యం చేసేలా, భూమిని సంరక్షించే ఎరువులకు ప్రాధాన్యతనిచ్చే విధంగా సబ్సిడీ విధానాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయ మంత్రితో పలుమార్లు చర్చించినట్లు వెల్లడించారు. దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో ఈనెల 18న సమావేశం నిర్వహించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిని ఆహ్వానించినట్లు తెలిపారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాయితీలు..

కూరగాయల ఉత్పత్తి పెంచడంతోపాటు వాటి నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రం సరిగా వినియోగించుకోలేకపోయిందని చెప్పారు. గత రెండు మూడు ఏండ్లుగా కేంద్రం నుంచి వచ్చే నిధులకు రాష్ట్ర వాటాను జోడించి 60:40 నిష్పత్తిలో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాయితీలు అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ విమానాశ్రయానికి సమీపంలో 170 ఎకరాల్లో భారీ మార్కెట్‌‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. హైదరాబాద్‌‌లోని పహాడీషరీఫ్, గుడిమల్కాపూర్ తదితర మార్కెట్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.

 పెస్టిసైడ్స్ వినియోగం తగ్గించాలి: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

రాష్ట్రంలో కూరగాయల సాగు చాలా తగ్గిందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడ చూసినా కూరగాయలు, సన్‌‌ఫ్లవర్, కందులు, పెసర పంటలే కనిపించేవని, ఇప్పుడు మొత్తం వరి సాగే కనిపిస్తోందని తెలిపారు. భవిష్యత్​లో ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ‘రాష్ట్రంలో కూరగాయల సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. పెస్టిసైడ్స్ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. దీనివల్ల క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. పెస్టిసైడ్స్ నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ప్రస్తుత రోజుల్లో ఎంత ఆస్తి ఉందనే అంశం కంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేదే ముఖ్యం. 

కూరగాయలతోపాటు పాలల్లో కూడా కల్తీ జరుగుతోంది. ఇంట్లో తినేది హెల్తీ ఫుడ్ అని భావిస్తున్నాం. బయట ఏది తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది’  అని అన్నారు. విజయ డైరీని అభివృద్ధి చేయడంతోపాటు కల్తీ లేని పాలను ప్రజలకు అందించాలన్నారు. కోతుల బెడద అధికంగా ఉండటంతో రైతులు కూరగాయల సాగు చేయలేకపోతున్నట్లు తెలిపారు. ప్రజల మీద కోతులు దాడి చేస్తున్నట్లు అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. కోతుల బెడదను అరికట్టి, పురుగలమందుల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెస్టిసైడ్స్ వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని సూచించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాత్ నగర్ దగ్గర కూరగాయల సాగు ఎక్కువగా ఉంటుందని, అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మలను ఎమ్మెల్యే కూనంనేని కోరారు.