- పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఉభయ సభల ఆమోదం
- గ్రామసభ తీర్మానంతోనే అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు
- ఫండ్స్ కోసం ట్రెజరీ చుట్టూ తిరిగే తిప్పలుండవు ఇక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబన, పల్లెల స్వయం పాలనకు ఊతమిచ్చే దిశగా కీలక ముందడుగు పడింది. పంచాయతీలకు సమకూరే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీల్లో కాకుండా సమీపంలోని బ్యాంకుల్లో జమ చేసుకుని నేరుగా అభివృద్ధి పనులకు ఖర్చు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన ‘తెలంగాణ పంచాయతీరాజ్ (నాలుగో సవరణ) బిల్లు–2026’కు శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, సభ్యులందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 2018 నాటి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 70(3)కి చేసిన ఈ సవరణ ద్వారా గ్రామాల నిధుల వినియోగంలో ఏండ్ల తరబడి నెలకొన్న జాప్యానికి తెరపడనుంది.
గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతి రూపాయి గ్రామాభివృద్ధికే ఖర్చు కావాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి సీతక్క వెల్లడించారు. గతంలో పంచాయతీలకు పన్నులు, ఇతర రూపాల్లో వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాల్సి వచ్చేదని తెలిపారు.
తీరా గ్రామంలో డ్రైనేజీ సమస్య వచ్చినా, తాగునీటి పైపులు పగిలినా, వీధి దీపాలు పోయినా.. అత్యవసర పనులకు ఆ డబ్బును ట్రెజరీ నుంచి తీసుకోవడానికి తీవ్ర ఆలస్యమయ్యేదని, దీంతో పంచాయతీ వద్ద సొంత నిధులు ఉన్నా వాడుకోలేని దుస్థితి ఉండేదని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం మున్సిపాలిటీలకు బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వెసులుబాటు ఇచ్చి, పంచాయతీలను మాత్రం విస్మరించిందని విమర్శించారు. అందుకే ఈ చట్ట సవరణ తీసుకొచ్చామని, ఇకపై పంచాయతీల సొంత ఆదాయంతో పాటు కేంద్ర, రాష్ట్ర పథకాల నిధులను కూడా నేరుగా స్థానిక బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లోనే జమ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
గ్రామంలో సమస్య రాగానే గ్రామసభ తీర్మానం చేసుకొని, ఎవరి అనుమతుల కోసమూ ఎదురుచూడకుండా వెంటనే ఖర్చు చేసుకునే స్వేచ్ఛ పంచాయతీలకు దక్కుతుందని సీతక్క వివరించారు.
భారం పడుతున్నా వెనకడుగు వేయం..
బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ వల్ల పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో, కేంద్రం నుంచి రావాల్సిన 2025–26 రెండో విడత నిధులు రూ.619 కోట్లు ఇంకా రావాల్సి ఉందని మంత్రి సీతక్క వెల్లడించారు. వీబీ-జీ రాంజీ పథకంలో కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనల వల్ల రాష్ట్రంపై దాదాపు రూ.2 వేల కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ పల్లెల అభివృద్ధి ఆగకూడదని రాష్ట్ర ప్రభుత్వమే ప్రతినెలా పంచాయతీలకు రూ.50 కోట్లు ఇస్తున్నట్టు తెలిపారు.
గ్రామాల్లో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లకు ఒకటో తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని, భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లేలా డబుల్ రోడ్లు వేస్తున్నామని.. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, గ్రామ పాలనలో కీలకమైన ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ అంశంపై కూడా త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క వెల్లడించారు.
సహకార బ్యాంకులకు ప్రాధాన్యమివ్వాలి..
బిల్లుపై జరిగిన చర్చలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
అయితే, ఈ అంశంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేసే క్రమంలో రైతులకు, గ్రామీణ ప్రాంతాలకు అండగా నిలుస్తున్న కో-ఆపరేటివ్ బ్యాంకులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అక్కడ వడ్డీ రేట్లు కూడా బాగున్నందున ఈ అంశాన్ని పరిశీలించాలని కోరారు.
గవర్నర్ ఆమోదానికి బిల్లు..
సభ్యుల సూచనల అనంతరం శాసనసభ, మండలి పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాయి. రాజ్యాంగం లోని 200వ అధికరణ ప్రకారం ఈ బిల్లును గవర్నర్ ఆమోదం నిమిత్తం పంపనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు.
గవర్నర్ ఆమోద ముద్ర పడిన వెంటనే అధికారిక గెజిట్ నోటిఫి కేషన్ ద్వారా ఈ చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో నిధుల విడుదలలో జాప్యం తప్పి, పల్లెల్లో ఎక్కడికక్కడే వేగంగా అభివృద్ధి పనులు సాగేందుకు మార్గం సుగమమైందని స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
