- అక్కడి మురుగు చెరువులో కలుస్తోంది
- చుట్టుపక్కల బోర్లలో కలుషిత నీళ్లే
- ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువును కాపాడాలని హైడ్రా చీఫ్‌కు విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీ/ఘట్‌కేసర్, వెలుగు: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ లోని లక్ష్మీనారాయణ చెరువును పరిరక్షించి అభివృద్ధి చేయాలని స్థానికులు, మత్స్యకారులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కోరారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు గురువారం హైడ్రా కమిషనర్ ..ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్త, హైడ్రా అడిషనల్కమిషనర్ ఆనంద్ కుమార్‌తో కలిసి చెరువును సందర్శించారు. లక్ష్మీనారాయణ చెరువు వద్ద వివిధ పార్టీల లీడర్లు, స్థానికులు కమిషనర్‌ను కలిసి చెరువు పరిస్థితిని వివరించారు. ఒకప్పుడు 600 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండి తాగునీరు, సాగునీరందించిన ఈ చెరువు ప్రస్తుతం కాలుష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. చేపలు కూడా చనిపోతున్నాయని, చుట్టుపక్కల బోర్లలోనూ కలుషిత నీరు వస్తోందని చెప్పారు. జవహర్‌నగర్ డంప్‌యార్డు నుంచి మురుగునీటి ద్వారా వచ్చే వ్యర్థాలు చెరువులో కలవడం వల్లే మరింత దారుణంగా మారిందని గ్రామస్తులు ఆరోపించారు.
నవంబర్‌లో నల్లచెరువు ప్రారంభం...
ఉప్పల్ నల్లచెరువు, నాచారం చెరువు, రామంతాపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని రంగనాథ్ ఆదేశించారు. ఉప్పల్ నల్లచెరువును నవంబర్‌లో సీఎం ప్రారంభిస్తారని, అప్పటిలోగా అన్ని పనులను పూర్తి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. చెరువు సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 155లోని తాత్కాలిక షెడ్లను ఖాళీ చేయించి వెండర్లకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్త తెలిపారు. ఇందుకు హైడ్రా సహకరించాలని కోరారు.
