హైదరాబాద్: కూకట్ పల్లి KPHBలో భారీ చిట్ ఫండ్ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి, చివరికి ఇల్లు ఖాళీ చేసి పరారయ్యారు దంపతులు. కూకట్‌పల్లిలోని ఇందిరానగర్‌కు చెందిన బక్కా మారుతి రెడ్డి (55) అనే వ్యాపారి KPHB పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అడ్డగుట్టలో నివాసముంటున్న రమణారెడ్డి, సీత దంపతులు గత కొన్ని ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తూ ప్రజలకు నమ్మకం కల్పించి ఇప్పుడు ఏకంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దీనితో అడ్డగుట్టలోని ఆమె నివాసం వద్ద బాధితులందరూ ధర్నాకు దిగారు. ఇప్పటికే మోసపోయిన తమకి ఐ.పీ (insolvency petition) పెట్టి కోర్టు నుంచి 48 మందికి కోర్టు నుంచి నోటీసులు రాగా ఇప్పుడే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అని వాపోయారు.
కూతురి పెళ్లి కోసం, పిల్లల చదువుల కోసం, సొంత ఇంటి నిర్మాణం కోసం చిట్టీలు వేసి డబ్బులు దాచిపెడితే ఇప్పుడు ఈ కుటుంబం మొత్తం మమ్మల్ని మోసం చేసి రోడ్డున పడేశారని వాపోయారు. ఇంకా వీరి బాధితులు చాలామంది ఉన్నారని దాదాపు రూ.50 నుంచి 70 కోట్ల మేర డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు.
►ALSO READ | జనగామ జిల్లాలో లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ చేసిన మెడిసిన్ స్వాధీనం
తమ డబ్బులు తీసుకొని విలాసవంతమైన జీవితం గడుపుతూ.. కూతురు పెళ్లి ఘనంగా చేయడంతో పాటు కేజీల కొద్దీ బంగారం, వెండి కట్నంగా ఇచ్చారని బాధితులు చెప్పారు. అంతే కాకుండా స్థలాలను కూడా కొనుగోలు చేశారని అన్నారు. ఇప్పుడు తమ దగ్గర ఏమీ లేదంటూ ఐపీ పెట్టి పారిపోయారని ఆరోపించారు.
