ఆర్మీ ఆయుధాల చోరీ కేసు..భార్య గట్టిగా నిలదీస్తే.. మల్లేష్ నిజం ఒప్పుకున్నడు

ఆర్మీ ఆయుధాల చోరీ కేసు..భార్య  గట్టిగా నిలదీస్తే.. మల్లేష్ నిజం ఒప్పుకున్నడు

హైదరాబాద్: సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారంలో జరిగిన ఆయుధాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పది రోజుల పాటు పోలీసులకు సవాల్‌గా మారిన ఈ కేసులో కీలక నిందితుడిగా మాజీ హవల్దార్ మల్లేష్‌ను గుర్తించినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మల్లేష్‌ను విచారించడంతో చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఎక్కడ దాచారనే విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.

డీజీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. ఆగస్టు 30వ తేదీ తెల్లవారుజామున మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారంలో చోరీ జరిగినట్లు తెలిపారు. అదే రోజు ఉదయం ఆర్మీ ఉద్యోగి వినోద్ కుమార్ ఆయుధాగారం తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారని చెప్పారు. అనంతరం బ్రిగేడియర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఏడు పిస్టళ్లు, నాలుగు ఏకే-203 రైఫిళ్లు చోరీ

చోరీలో ఏడు పిస్టళ్లు, నాలుగు ఏకే-203 రైఫిళ్లు, ఒక ఇన్సాస్ నైట్ విజన్ బైనక్యులర్ చోరీకి గురైనట్లు డీజీపీ తెలిపారు. రెండో భవనంలో ఉన్న మందుగుండు సామగ్రి బాక్సులు కూడా మాయమైనట్లు చెప్పారు.

ఈ కేసు దర్యాప్తును మల్కాజ్‌గిరి పోలీసులు, మిలిటరీ ఇంటెలిజెన్స్, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టారు. మొదటి దశలో ఆయుధాగారంలోకి బయట వ్యక్తులు ప్రవేశించి చోరీ చేయడం దాదాపు సాధ్యం కాదని, ఇన్‌సైడర్ ప్రమేయం ఉండొచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారని డీజీపీ వివరించారు.


ఆయుధాగారంలోకి ఎవరెవరికి అనుమతి ఉందనే విషయంపై పోలీసులు ప్రత్యేక జాబితా రూపొందించారు. తొలుత పది మందిని గుర్తించి విచారించారు. ఆయుధాగారం వద్ద తరచుగా కదలికలు ఉండే ఆరుగురిని షార్ట్‌లిస్ట్ చేసి ప్రశ్నించారు.

అదే విధంగా ఏడుగురు ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, శిక్షగా విధులకు దూరంగా ఉన్న 36 మంది, సెలవులో ఉన్న 54 మంది, సర్వీస్‌లో క్రమశిక్షణా చర్యల కారణంగా విధులకు దూరంగా ఉన్న ఏడుగురిని కూడా విచారించినట్లు డీజీపీ తెలిపారు.

కోపంతో ఎవరైనా ఆయుధాలను దొంగిలించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేశారు. డ్రగ్ మాఫియా, స్పై నెట్‌వర్క్ వంటి కోణాల్లోనూ విచారణ జరిపారు. సీసీటీవీ ఫుటేజీ, డాగ్ స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్స్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేశాయి.

మల్లేష్‌పై అనుమానం ఎలా వచ్చింది?

మొదట ఆయుధాగారం ఇన్‌చార్జ్ వినోద్ కుమార్, శ్రీరామ్ ప్రసాద్‌లను ప్రధాన అనుమానితులుగా భావించి విచారించినా ఎలాంటి ఆధారాలు లభించలేదని డీజీపీ తెలిపారు.తర్వాత పెన్షన్‌పై ఉన్న ఏడుగురిలో ఇద్దరిని విచారించారు. వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హవల్దార్‌తో పాటు మల్లేష్ కూడా ఉన్నాడు. జూన్ 30న ఆరోగ్య, క్రమశిక్షణా కారణాలతో మల్లేష్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.