బెంగాల్ను షేక్ చేస్తున్న మాంసాహార వివాదం.. గుడిలో చేపమాంసం తిన్న సీఎం.. ఏంటి కాంట్రవర్సీ..?

బెంగాల్ను షేక్ చేస్తున్న మాంసాహార వివాదం.. గుడిలో చేపమాంసం తిన్న సీఎం.. ఏంటి కాంట్రవర్సీ..?

ప్రజాభీష్టం, ఆచారాల ముందు పార్టీ సిద్ధాంతాలను కొన్ని సార్లు పక్కన పెట్టాల్సి రావడం అంటే ఇదేనేమో. దేశ వ్యాప్తంగా పండుగల సమయంలో మాంసాహార నిషేధానికి పిలుపునిచ్చే బీజేపీ, ఆ పార్టీ అనుబంధ సంఘాలు.. పశ్చిమబెంగాల్ లో మాత్రం..  వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది. ఏకంగా సీఎం వెళ్లి ఆలయంలో మాంసాహారం తినటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న వివాదం పార్టీ మెడకు చుట్టుకోకుండా ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి మాంసాహారం తినే వీడియో వైరల్ గా మారింది. ఏకంగా ముఖ్యమంత్రే గుడిలో మాంసాహారం తినడం వెనుక ఉన్న వివాదం, పరిణామాల గురించి తెలుసుకుందాం.

గుడిలో చేపమాంసం తిన్న సీఎం:

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అదికారి 2026 సెప్టెంబర్ 11 (శుక్రవారం) కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయంలో చేపమాంసం తిన్నారు. కౌశికీ అమావాస్య సందర్భంగా కాళీ మాతకు ప్రార్థనలు చేసిన సీఎం..  అనంతరం ఆలయంలోని సంప్రదాయ భోగాన్ని, ఇందులో చేప, బసంతి పులావులను  స్వీకరించారు. కాళీఘాట్ ఆలయంలో, సీఎం నేలపై కూర్చొని చేప తల, వేయించిన చేప, బసంతి పులావుతో కూడిన సంప్రదాయ భోగాన్ని తిన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

గుడిలో చేపమాంసం వెనుక:

కాళీ మాతకు చేపలు, మాంసం ప్రసాదంగా అర్పించడం సంప్రదాయం. ఆ తరువాత ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. ప్రార్థనల తర్వాత కౌశికీ అమావాస్య సనాతన సంస్కృతిలో ముఖ్యమైన సందర్భమని సీఎం చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాన ఆలయాలు, కాళీఘాట్ ,, తరాపిత్ వంటి ఆలయాలు ప్రత్యేక పూజలతో ఈ పండుగను జరుపుకుంటున్నాయి. 

ఏంటి వివాదం:

సీఎం గుడిలో చేపమాంసం తినటం వెనుక పెద్ద వివాదమే ఉంది.  బాగేశ్వర్ ధామ్ అధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.  దుర్గా పూజ సమయంలో బెంగాలీ హిందువులు  మాంసాహారం తినకూడదని,  మాంసం తినేవారిని పాపాత్ములు (పాక్హండి)గా అభివర్ణించారు. అంతే కాకుండా నవరాత్రుల సమయంలో ఆలయాల చుట్టు పక్కల మాంసాహారం అమ్మకూడదని కూడా ఆయన పిలుపునిచ్చారు. దీంతో బెంగాల్ లో వివాదం చెలరేగింది. 

హైరా లిలువాలో 3 రోజుల పాటు జరిగిన హనుమంత కథ కార్యక్రమానికి హాజరైన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసి వ్యాఖ్యలు బెంగాల్ లో సంప్రదాయ హిందువుల్లోనూ ఆగ్రహం తెప్పించాయి. ఇంట్లో దేవతా విగ్రహాన్ని ప్రతిష్టించకపోయినా పర్లేదు కానీ.. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి దరిదాపుల్లో కూడా మాంసాహార విక్రయాలు, తినడం వంటివి చేయకూడదని.. అలా చేస్తే పాపాత్ములు అంటూ వ్యాఖ్యానించారు. అంతకు ముందే విశ్వహిందూ పరిషత్ కూడా మాంసాహార నిషేదానికి పిలుపునిచ్చిన విషయం  తెలిసిందే.

ALSO READ : దేశానికే ఆదర్శంగా తెలంగాణ కులగణన

హిందువుల నుంచే తీవ్ర వ్యతిరేకత:

ఒకవైపు విశ్వహిందూ పరిషత్ పిలుపు, మరోవైపు కృష్ణ శాస్త్రి వ్యాఖ్యలతో బెంగాల్ లో తీవ్ర దుమారం రేగింది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చాలని ప్రయత్నించడమేంటని ప్రశ్నలు వెల్లువెత్తాయి. సంప్రదాయ హిందువులు కూడా వ్యతిరేకించడం, అధికార బీజేపీ మద్ధతుతోనే సంప్రదాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలకు దిగారు. దీంతో ఈ వివాదం బీజేపీ పార్టీ మెడకు, ప్రభుత్వానికి చుట్టుకోకుండా ఉండేందుకు.. స్వయంగా సీఎం సువేందు అధికారి గుడిలో చేపమాంసం తిని.. బెంగాల్ సంప్రదాయాలను గౌరవిస్తున్నట్లు.. బీజేపీ వ్యతిరేకం కాదని నిరూపించే ప్రయత్నం చేశారు. 

ఈ సందర్భంగా..  శాస్త్రి వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు, అది ఆయన  వ్యక్తిగత అభిప్రాయం అని.. బీజేపీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.  ప్రజలు దాన్ని అంగీకరించాలా లేదా వద్దా అనేది వాళ్ల విషయం అని స్పష్టం చేశారు.

ఆ సందర్భంగా తన ఆధ్యాత్మిక ఆచారాలను వివరించారు సీఎం సువేందు అధికారి. మహాష్టమి రోజున, కార్తీక మాసంలో సాత్త్విక ఆహారం తీసుకుంటానని చెప్పారు.  కాళీ మాతకు అర్పించిన మాంసాహారాన్ని కూడా తింటానని చెప్పారు. నేను ఒక సనాతన హిందువుని.. మహాష్టమి రోజున, నేను మాత దుర్గాను పూజిస్తాను, సత్త్విక ఆహారం తీసుకుంటాను. కార్తీక్ నెలలో కూడా, నేను సత్త్విక ఆహారం తీసుకుంటాను. అదే సమయంలో, నేను మాత కాళీకి అర్పించిన మాంసాహారం, ఉదాహరణకు గొర్రె మాంసం, తింటాను  అని  చెప్పారు. 

మరోవైపు ఈ వివాదాన్ని పార్టీకి చుట్టుకోకుండా ముందుగానే బీజేపీ చీఫ్  సమిక్ భట్టాచార్య ఇప్పటికే పలుమార్లు స్పష్టత ఇచ్చారు. బెంగాళీలు చేపలు, మాంసం తినడం కొనసాగింవచ్చునని.. ఆహార అలవాట్ల విషయంలో ఎలాంటి బలవంతం లేదని చెప్పారు.  

రాష్ట్రవ్యాప్త నిరసనలు:

మఠాధిపతి శాస్త్రి చేసిన వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బీజేపీ ఉత్తరాది ఆచారాలను బెంగాల్ పై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని విమర్శలు వచ్చాయి. మరోవైపు తృణమూల్ పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా బీజేపీతో పాటు ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెట్టాయి. బెంగాల్ సంప్రదాయాలను ఎవరూ మార్చలేరని, అలాంటి ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  సీఎం సువేందు అధికారి, శాస్త్రి చిత్రపటాలకు నిప్పంటించి నిరసనలు తెలిపారు. 

ఈ వివాదం పార్టీకి ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా మారుతున్న తరుణంలో సీఎం స్వయంగా రంగంలోకి దిగి.. ఆలయంలో చేప మాంసాన్ని తిన్నారు. తమ పార్టీ, ప్రభుత్వం బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తుందనే సందేశాన్ని ప్రజల్లోకి పంపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.  దీంతోనైనా ఈ వివాదం ముగుస్తుందేమోనని భావిస్తున్నారు. చూడాలి మరి ఆహార సంప్రదాయాల వివాదం ఇక్కడితో ఆగుతుందా మరో మలుపు తీసుకుంటుందా అనేది.