కైంచి ధామ్ కాదు, నీమ్ కరోలి బాబా తపస్సు చేసిన ప్రదేశం ఇదే ! ఆ పేరు ఎలా వచ్చిందంటే ?

 కైంచి ధామ్ కాదు, నీమ్ కరోలి బాబా తపస్సు చేసిన ప్రదేశం ఇదే ! ఆ పేరు ఎలా వచ్చిందంటే ?

నీమ్ కరోలి బాబా పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉత్తరాఖండ్‌లోని ఫెమస్  'కైంచి ధామ్'. చాలామంది బాబా మొదటగా తపస్సు చేసిన ప్రదేశం అదే అనుకుంటారు. కానీ, ఆయన తొలిసారిగా ఆధ్యాత్మిక సాధన చేసిన పవిత్ర స్థలం ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం. అక్కడ జరిగిన ఒక అద్భుత సంఘటన వల్ల ఏకంగా ఒక రైల్వే స్టేషనే ఏర్పాటైంది. బాబా జీవితంలో చోటుచేసుకున్న ಆ ఆసక్తికరమైన కథేంటో ఇప్పుడు చూద్దాం...

'నీమ్ కరోలి బాబా'గా పేరు ఎలా వచ్చింది?

ఉత్తర ప్రదేశ్‌లోని అక్బర్‌పూర్‌లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బాబా అసలు పేరు లక్ష్మీనారాయణ్. చిన్నతనం నుంచే ఆయనకు ఆధ్యాత్మికతపై అమితమైన ఆసక్తి ఉండేది. కేవలం 12 ఏళ్ల వయసులోనే ప్రాపంచిక బంధాలను విడిచిపెట్టి, హనుమంతుని ఉపాసనకు తన జీవితాన్ని అంకితం చేశారు.

ఈ క్రమంలో గుజరాత్ వెళ్లిన ఆయనకు అక్కడ 'లక్ష్మందాస్' అనే పేరు వచ్చింది. కొన్ని సంవత్సరాల ఆధ్యాత్మిక సాధన తర్వాత, ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలోని 'నీబ్ కరోరి' అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ చాలా ఏళ్ల పాటు తీవ్ర తపస్సు చేశారు. ఆయన ఆధ్యాత్మిక శక్తులు, మహిమలను చూసిన స్థానికులు ఆయనను 'నీబ్ కరోరి బాబా' అని పిలవడం ప్రారంభించారు. మెల్లిమెల్లిగా ఆ పేరే 'నీమ్ కరోలి బాబా'గా స్థిరపడిపోయింది.

టీటీ చెకింగ్ - ఆగిన రైలు

నీబ్ కరోరి గ్రామంలో సాధన చేస్తున్న రోజుల్లో ఒకసారి బాబా రైలులోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్నారు. టికెట్ చెకింగ్ కోసం వచ్చిన బ్రిటీష్ అధికారి (టీటీ) బాబా వద్ద టికెట్ లేకపోవడంతో, ఆయనను తీవ్రంగా అవమానించి ఒక నిర్జన ప్రదేశంలో రైలు నుంచి కిందకు దింపేశారు.

బాబా ఏ మాత్రం కోపగించుకోకుండా, ప్రశాంతంగా రైలు దిగి సమీపంలోని చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నారు. కానీ, అసలు అద్భుతం అప్పుడే జరిగింది. డ్రైవర్ రైలును ఎంతగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినా అది అంగుళం కూడా ముందుకు కదల్లేదు. ఇంజన్ మార్చి, బొగ్గు మళ్లీ నింపి చెక్ చేసినా ఫలితం లేకుండా పోయింది.

బ్రిటిష్ అధికారి క్షమాపణలు.. కొత్తగా రైల్వే స్టేషన్:

రైలు కదలకపోవడంతో ప్రయాణికులు బాబా మహిమల గురించి అధికారులకు వివరించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న బ్రిటీష్ అధికారి, టీటీలు పరుగున బాబా వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారు... తిరిగి రైలు ఎక్కాలని వేడుకున్నారు. దానికి బాబా అంగీకరిస్తూ రెండు షరతులు విధించారు:
*ఇకపై ఏ సాధువును గానీ, సన్యాసిని గానీ రైలు నుంచి అవమానించి దింపేయకూడదు.
*నన్ను దింపేసిన ఈ 'నీబ్ కరోరి' గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ఒక రైల్వే స్టేషన్‌ను నిర్మించాలి.

బాబా విధించిన రెండు షరతులకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. ఆయన రైలు ఎక్కగానే బండి సాధారణంగా ముందుకు కదిలింది. ఆ తర్వాత బాబాకి మాట ఇచ్చినట్లే ఆ గ్రామంలో 'నీబ్ కరోరి రైల్వే స్టేషన్' ను నిర్మించారు. ఇప్పటికీ ఆ స్టేషన్ బాబా మహిమకు నిదర్శనంగా నిలిచి ఉంది.