దేవుడికి ఇన్సూరెన్స్ ఉంటుందా? జీఎస్‌బీ సేవా మండల్ గణేష్ రూ.703కోట్ల పాలసీ అసలు నిజాలు!

దేవుడికి ఇన్సూరెన్స్ ఉంటుందా? జీఎస్‌బీ సేవా మండల్ గణేష్ రూ.703కోట్ల పాలసీ అసలు నిజాలు!

కోట్లాది రూపాయల విరాళాలు, వేలాది మంది భక్తులు, భారీ ఏర్పాట్లతో జరిగే వినాయక ఉత్సవాల్లో భద్రత చాలా ముఖ్యం. కొన్ని గణపతి మండలాలు ఏకంగా వందల కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ కవర్ తీసుకుంటున్నాయి. ఉదాహరణకు.. ముంబైలోని ప్రసిద్ధ జీఎస్‌బీ సేవా మండల్ ఈ ఏడాది తమ గణపతి విగ్రహాన్ని 66 కిలోల బంగారు, 335 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించనుంది. ఇందుకోసం ఏకంగా రూ.703 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ చేయించింది. అయితే ఇంత భారీ మొత్తం చూసి దేవుడి విగ్రహానికే అంత విలువ కట్టి ఇన్సూరెన్స్ చేశార అనుకుంటే పొరబడినట్టే. అసలు "భగవంతుడికి ఇన్సూరెన్స్" అంటూ ప్రత్యేకంగా ఎలాంటి పాలసీ మార్కెట్లో ఉండదు.

భారీ ఉత్సవాల సమయంలో దేవుడిని అలంకరించే బంగారు, వెండి ఆభరణాలకు దొంగతనం, అగ్నిప్రమాదాలు లేదా ఇతర ప్రమాదాల నుంచి రక్షణ కల్పించడమే ఈ ఇన్సూరెన్స్ ప్రధాన ఉద్దేశ్యం. ఉత్సవ మండపంలో ఉండే విలువైన వస్తువులు, తాత్కాలిక నిర్మాణాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు, ప్రసాద వితరణ కేంద్రాలు వంటి అన్నింటినీ ఈ పాలసీ పరిధిలోకి తీసుకువస్తారు. అంతేకాకుండా ఆభరణాలను ఒక చోటు నుంచి మరో చోటుకి రవాణా చేసే సమయంలో జరిగే ప్రమాదాలకు కూడా రక్షణ లభిస్తుంది.

భక్తుల రక్షణ, పబ్లిక్ లయబిలిటీ:
ఉత్సవాలకు వచ్చే వేలాది మంది భక్తుల ప్రాణాలకు భద్రత కల్పించడం నిర్వాహకుల బాధ్యత. పెద్ద ఎత్తున జనం గుమిగూడినప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉంది. అందుకే నిర్వాహకులు పర్సనల్ యాక్సిడెంట్ కవర్, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. దీనివల్ల వేడుకల సమయంలో ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగి థర్డ్ పార్టీ వ్యక్తులకు నష్టం వాటిలితే.. ఆ చట్టపరమైన బాధ్యతల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ ఆదుకుంటుంది.

రూ.703 కోట్లు అంటే గ్యారంటీ పేఅవుటా?
ఇన్సూరెన్స్ పేపర్‌పై కనిపించే వందల కోట్ల సంఖ్య కేవలం ఒకే ఒక్క వస్తువుకోసం కట్టిన మొత్తం కాదు. అది వివిధ రకాల ఆస్తులు, వ్యక్తిగత ప్రమాదాలు, పబ్లిక్ లయబిలిటీ వంటి అన్ని విభాగాలుగా కలిపి తీసుకున్న మెుత్తం కవరేజీ. ఒకవేళ ఏదైనా అపశృతి జరిగితే ఆ మొత్తం నేరుగా చేతికి రాదు. ప్రతి సెక్షన్‌కు ఉండే పరిమితులు, కండిషన్లు, డిడక్టిబుల్స్ ఆధారంగానే క్లెయిమ్ వర్తిస్తుంది.

భారతీయ చట్టాల ప్రకారం హిందూ దేవతా విగ్రహాలను కొన్ని ప్రత్యేక సందర్భాలలో "న్యాయపరమైన వ్యక్తులుగా" పరిగణించి ఆస్తులు కలిగి ఉండే హక్కు కల్పిస్తారు. కానీ దేవుడు స్వయంగా ఏ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయలేడు. ఆయా ఉత్సవాలను నిర్వహించే ట్రస్ట్‌లు, మండపాలు, లీగల్ ఎంటిటీలే ఇన్సూరెన్స్ పాలసీ అగ్రిమెంట్లు కుదుర్చుకుంటాయి. గణపతి ఉత్సవాలకు తీసుకునే ఈ భారీ ఇన్సూరెన్స్‌ను దేవుడికి చేసే రక్షణగా కాకుండా, ఉత్సవ నిర్వహణలో ఎదురయ్యే ఆర్థిక నష్టాలను తగ్గించుకునే మార్గంగా చూడాలి. ఇదంతా కేవలం దేవుడిని కాపాడుకోవడం కాదు, ఉత్సవాల చుట్టూ ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులను, భక్తుల భద్రతను ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉంచే ఆర్థిక భరోసా.