ఒకప్పుడు మన దేశంలో ఇంజనీరింగ్ చదివితే చాలు.. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే చేతిలో ఆఫర్ లెటర్లు ఉండేవి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి పెద్ద కంపెనీలు కాలేజీలకు వచ్చి వేల సంఖ్యలో విద్యార్థులను ఏకకాలంలో హైరింగ్ చేసుకునేవి. ఆ రోజులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. టెక్ ప్రపంచంలో వస్తున్న అనూహ్య మార్పులు, AI రాకతో జాబ్ మార్కెట్లలోని పరిస్థితులు తలకిందులయ్యాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో లేఆఫ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక్క భారత్‌లోనే సుమారు 25 వేల నుంచి 35 వేల వరకు ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇవి కేవలం ఉద్యోగాలు తీసేయడమే కాదు.. అంతర్గతంగా కంపెనీలు చేస్తున్న పెద్ద మార్పులని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏఐ ఆటోమేషన్ వల్ల రొటీన్ కోడింగ్, మాన్యువల్ టెస్టింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి సాధారణ పనులన్నీ ఇప్పుడు ఏఐ ఏజెంట్లు చేసేస్తున్నాయ్. దీనివల్ల జూనియర్ ఇంజనీర్ల అవసరం తగ్గిపోయింది.
కాలేజీల్లో జరిగే మాస్ రిక్రూట్‌మెంట్ విధానానికి దాదాపు భవిష్యత్తులో ఉండవనే చెప్పుకోవాలి. ఒకప్పుడు 6 లక్షల వరకు ఉన్న ఫ్రెషర్ల నియామకం ఇప్పుడు భారీగా పడిపోయింది. ఆఫర్ లెటర్లు వచ్చినా నెలల తరబడి జాయినింగ్స్ వాయిదా పడుతున్నాయి. కంపెనీలు కొత్తవారిని ట్రైనింగ్ ఇచ్చి బెంచ్‌పై కూర్చోబెట్టడానికి సిద్ధంగా లేవు. మార్కెట్‌లోకి నేరుగా ప్రాజెక్టులు చేయగల నిపుణులే కావాలంటున్నాయి. కేవలం డిగ్రీ మార్కులు, సీజీపీఏ చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయి.. టెక్నాలజీపై పట్టు ఉందా లేదా అని చూసే ప్రెసిషన్ హైరింగ్ విధానం ఇప్పుడు జాబ్ మార్కెట్లో నడుస్తోంది.
అయితే ఈ సంక్షోభ సమయంలోనూ ఏఐ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటా అనలిటిక్స్ వంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రం ఉద్యోగ అవకాశాలకు కొదవలేదు. దేశంలో విదేశీ కంపెనీలకు చెందిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కానీ వీరు సాధారణ విద్యార్థులను కాకుండా.. అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉన్న సీనియర్లనే హైర్ చేసుకుంటున్నాయి. దానికి తగినట్లుగానే భారీ పేమెంట్స్ ఆఫర్ చేస్తున్నాయి.
ALSO READ ;ఆయుధాలు, బయో వెపన్స్ తయారీకి AI వాడకుండా ఆపాం
ఈ మారుతున్న ట్రెండ్‌ను బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు. టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఏఐని భయంగా కాకుండా మన పనికి ఒక శక్తిగా వాడుకోగలిగితేనే టెక్ రంగంలో భవిష్యత్తు సురక్షితం అని అంటున్నారు నిపుణులు. రోజుకో కొత్త ఛాలెంజ్ విసురుతున్న ఏఐ మోడళ్లను మనుషులు ఎలా ఎదుర్కొంటాన్నదే భవిష్యత్తు ఉపాధి అవకాశాల రూపురేఖలను మార్చుతుందని నిపుణులు చెబుతున్నారు.
