తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజూ వివిధ రకాల అన్నప్రసాదాలు, పిండి వంటలు, ఇతర రుచికరమైన పదార్థాలను శాస్త్రోక్తంగా నైవేద్యంగా సమర్పిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో జరిగే నైవేద్య కైంకర్యాల్లో ఆయా సమయాలకు అనుగుణంగా ప్రత్యేకమైన ప్రసాదాలను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారికి ఇన్ని రకాల నైవేద్యాల వెనుక ఆగమ సంప్రదాయాలే కారణం.
ప్రసాదాల వెనుక వైఖానస ఆగమ సంప్రదాయాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో నైవేద్యాలకు ప్రత్యేకమైన వైఖానస ఆగమ సంప్రదాయాలు ఉన్నాయి. ఆలయ పోటులో నైవేద్య పదార్థాలను అత్యంత పవిత్రతతో, సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా సిద్ధం చేస్తారు. నైవేద్య తయారీలో ఉపయోగించే పదార్థాలు, పాత్రలు, తయారీ విధానాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.
శ్రీవారి నైవేద్యంలో ఎండుమిర్చి, పచ్చిమిర్చిని ఉపయోగించకుండా నల్లమిరియాలను వినియోగించడం ప్రాచీన సంప్రదాయంగా కొనసాగుతోంది. వైఖానస పరిభాషలో భక్తులు పులిహోరగా పిలుచుకునే ప్రసాదాన్ని ‘తింత్రిణీరసాన్నం’, నెయ్యి పొంగలిని ‘ముద్గాన్నం’, బెల్లం అన్నాన్ని ‘గుడాన్నం’, మిరియాల అన్నాన్ని ‘మరీచ్యాన్నం’, వడను ‘మాషాపూపం’, దోశను ‘చక్రప్పం’ అని పిలుస్తారు.
ఈ సాంప్రదాయ పేర్లు, తయారీ విధానాలు శ్రీవారి నైవేద్యాల వెనుక ఉన్న ప్రాచీన ఆగమ సంప్రదాయాల ప్రత్యేకతను తెలియజేస్తాయి.
నిత్యం 45 ప్రసాదాల నివేదన :
నైవేద్య ప్రియుడైన శ్రీవారికి అనునిత్యం 45 రకాల ప్రసాదాలను నివేదిస్తారు. వీటిలో 20రకాల అన్న ప్రసాద నైవేద్యములు కాగా మిగిలినవి పణ్యారములు కావడం విశేషం.
మొదటి గంట అనంతరం ఉదయం నైవేద్యం
ఆలయంలో మొదటి గంట అనంతరం స్వామివారికి ఉదయం నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో మాత్రాన్నం, ముద్గాన్నం (నెయ్యి పొంగలి), తింత్రిణీరసాన్నం (పులిహోర), దధ్యోదనం (పెరుగన్నం), గుడాన్నం (బెల్లం అన్నం/చక్ర పొంగలి), శాకాన్నం (కదంబం అన్నం), శర్కరాన్నం (రవ్వకేసరి) వంటి ప్రసాదాలను సమర్పిస్తారు.
వీటితో పాటు ప్రతిరోజూ నాలుగు రకాల పణ్యారములు లేదా పిండి వంటలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిలో లడుకం (లడ్డు), మాషాప్పం (వడ), గుడప్పం (అప్పం), చక్రప్పం (దోశ) ఉన్నాయి.
రెండో గంట అనంతరం రాజభోగం
రెండో గంట అనంతరం స్వామివారికి మధ్యాహ్న నైవేద్యం లేదా రాజభోగాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గుడాన్నం, దధ్యోదనం, శీరా లేదా శక్కరభాత్ వంటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
మూడో గంట అనంతరం శయనభోగం
మూడో గంట అనంతరం రాత్రి నైవేద్యంగా శయనభోగాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలో మరీచ్యాన్నం (మిరియాల అన్నం), చక్రప్పం (దోశ), లడుకం (లడ్డు), మాషాప్పం (వడ), శర్కరాన్నం తదితర ప్రసాదాలను స్వామివారికి సమర్పిస్తారు.
సాయంకాల ఆరాధనలో ప్రత్యేక కైంకర్యాలు
సాయంకాల ఆరాధన సమయంలో గర్భాలయాన్ని మరోసారి శుభ్రపరిచి, శ్రీవారిని తాజా పుష్పాలతో అలంకరిస్తారు. సాయంకాల కైంకర్యాల అనంతరం నిర్వహించే శయనభోగంలో భాగంగా అర్ధరాత్రి సమయంలో స్వామివారికి ‘తిరువీసం’ అనే ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు.
తిరువీసంలో తెల్ల అన్నంతో పాటు బెల్లంతో తయారు చేసిన తీపి రుచిగల గుడాన్నం ఉంటుంది.
రోజులో చివరిగా నిర్వహించే ఏకాంత సేవలో స్వామివారికి వెచ్చని పాలు, కాలానుగుణంగా లభించే ముక్కలుగా కోసిన పండ్లు, నెయ్యిలో వేయించిన ఎండు పండ్లు సమర్పిస్తారు.
ప్రాచీన సంప్రదాయాలకు ప్రతీకగా నైవేద్య కైంకర్యాలు
శ్రీవారికి సమర్పించే నైవేద్యాలన్నీ ఆలయ సంప్రదాయాలు, ఆగమ విధానాలకు అనుగుణంగా సిద్ధం చేసి సమర్పిస్తారు. ప్రతి నైవేద్యానికి ప్రత్యేకమైన పేరు, తయారీ విధానం, సమర్పించే సమయం ఉండటం తిరుమల ఆలయ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది.
భక్తులు ప్రసాదంగా స్వీకరించే పులిహోర, పొంగలి, వడ, అప్పం తదితర పదార్థాల వెనుక ఇమిడి ఉన్న ఈ ప్రాచీన వైఖానస ఆగమ సంప్రదాయాలు శ్రీవారి నైవేద్యాల ప్రత్యేకతను మరింతగా తెలియజేస్తున్నాయి.
ప్రతిరోజూ వివిధ సమయాల్లో నిర్వహించే ఈ నైవేద్య కైంకర్యాలు తిరుమల శ్రీవారి ఆలయ ప్రాచీన వైదిక, ఆగమ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.
