గంట కరెంట్ పోతేనే నానా ఇబ్బందులు పడతాం.. అలాంటి రెండు రోజులుగా ఆ గ్రామంలో కరెంట్ లేదు. ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో గ్రామమంతా చీకటి మయం అయింది. కరెంట్ లేక చిన్ని పిల్లలు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ లో ఉన్న ఒకే ఒక్క ట్రాన్స్ ఫార్మర్ రెండు రోజుల క్రితం కాలిపోయింది.దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ట్రాన్స్ ఫార్మర్ ఇప్పటివరకు బాగు చేయించకపోవడంతో గ్రామస్తులకు కరెంట్ తిప్పలు తప్పడం లేదు. కరెంట్ లేక పిల్లలు, వృద్దులు, గ్రామస్తులు నానా అవస్థలుపడుతున్నారు. అసలే సీజన్ వ్యాధుల కాలం కావడంతో దోమలు, ఇతర కీటకాలు బెడదతో గ్రామస్తులు సతమతమవుతున్నారు.
గ్రామంలో నెలకొన్న కరెంట్ సమస్యపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ ఫార్మర్ బాగు చేయించి కరెంట్ పునరుద్దరణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
