హైదరాబాద్: వినాయక చవితి పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు కలిసి రావడంతో నగరంలో ఉంటున్న ప్రజలు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది.
రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి పండుగ వరుసగా రావడంతో లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది. దీంతో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, కుటుంబాలతో కలిసి సొంతూళ్లకు బయలుదేరుతున్నారు.ముఖ్యంగా సాయంత్రం సమయానికి ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ముందుగానే ప్రయాణికులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు.
ఎంజీబీఎస్, జేబీఎస్‌లలో భారీగా రష్
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ , జేబీఎస్ ప్రధాన బస్టాండ్లకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. సొంత జిల్లాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.పండగ రద్దీ కారణంగా బస్సులకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు నడిపే అంశంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
బస్టాండ్లతో పాటు హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకుంటున్నారు.కుటుంబాలతో కలిసి స్వస్థలాలకు వెళ్తున్న వారితో ప్లాట్‌ఫారాలు, టికెట్ కౌంటర్లు, స్టేషన్ పరిసరాలు రద్దీగా మారాయి. బస్సులు, రైళ్లకు డిమాండ్ పెరగడంతో ప్రయాణికులు ముందుగానే టికెట్లు, రిజర్వేషన్లు చేసుకుంటున్నారు.
ALSO READ ; బొజ్జగణపయ్యకు చాలా ఇష్టం.. పూర్ణం కుడుములు..
పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు అందుబాటులోకి తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నారు. రైల్వే అధికారులు కూడా రద్దీ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.వినాయక చవితి, వరుస సెలవుల నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు.పండగ వేళ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు సూచించారు. పిల్లలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
