ఆయుధాలు, బయో వెపన్స్ తయారీకి AI వాడకుండా ఆపాం: ఆంథ్రోపిక్ థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్

ఆయుధాలు, బయో వెపన్స్ తయారీకి AI వాడకుండా ఆపాం: ఆంథ్రోపిక్ థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్

అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంథ్రోపిక్' విడుదల చేసిన లేటెస్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ టెక్ ప్రపంచంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. క్లాడ్ ఏఐ మోడల్స్‌ను తప్పుడు పనుల కోసం వాడటానికి క్రిమినల్స్, దేశాల ప్రాయోజిత గ్రూపులు, స్పైవేర్ వెండర్లు, శాస్త్రవేత్తలు, ప్రొపగాండిస్టులు ప్రయత్నించినట్లు ఈ రిపోర్ట్ బట్టబయలు చేసింది. క్షిపణులు, బాంబుల డిజైన్ల నుంచి ప్రాణాంతక వ్యాధికారక క్రిములు, అసమ్మతి వాదులపై నిఘా వరకు ఏఐని దుర్వినియోగం చేయడానికి జరిగిన ప్రయత్నాల వివరాలను రిపోర్ట్ బయటపెట్టింది.

బయోలాజికల్ రీసెర్చ్ ముసుగులో:
ఈ నివేదికలో అత్యంత ప్రమాదకరమైన అంశంగా బయోలాజికల్ దుర్వినియోగాన్ని ఆంథ్రోపిక్ ప్రస్తావించింది. చట్ట ప్రకారం తమకు సపోర్ట్ చేయని ప్రాంతాల నుంచి తమ సేఫ్ గ్గార్డ్స్‌ను తప్పించుకుంటూ, చేస్తున్న పరిశోధనల అసలు ఉద్దేశాన్ని దాచిపెట్టి ఏఐని వాడిన 5 ప్రత్యేక కేసులను కంపెనీ గుర్తించింది. ఉదాహరణకు.. రష్యాకు చెందిన ఒక శాస్త్రవేత్త 'చికున్గున్యా' వైరస్‌పై సైనిక రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్రాంట్ అప్లికేషన్ కోసం క్లాడ్ ఏఐని వాడడాన్ని ఆంథ్రోపిక్ గుర్తించింది. ఇది వ్యాక్సిన్ల తయారీకి మాత్రమే కాకుండా.. బయోలాజికల్ ఆయుధాల సృష్టికి కూడా దారితీసే అవకాశం ఉండటంతో కంపెనీ వెంటనే ఆ అకౌంట్లను బ్యాన్ చేసినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది.

సైబర్‌ దాడులు.. నిఘా కార్యకలాపాలు:

కేవలం బయాలజీ మాత్రమే కాకుండా వివిధ దేశాలకు చెందిన హ్యాకర్లు, సంస్థలు ఏఐని ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఆంథ్రోపిక్ వివరించింది.
1. రష్యాకు చెందిన నిఘా వ్యవస్థల తమ ప్రయోజనాల కోసం ఇతర దేశాల సమాచారం సేకరించేందుకు 'స్మాష్-అండ్-గ్ర్యాబ్' హ్యాక్‌ల కోసం ఏఐని వాడారు.
2. చైనాకు చెందిన ఒక ప్రోగ్రామ్ సిరియాలోని ఉయిగర్లపై, అలాగే స్వదేశంలోని అసమ్మతి వాదులపై నిఘా పెట్టేందుకు ఏఐని ఉపయోగించుకుంది.
3. రష్యా, మలేషియా, ఇరాన్, బంగ్లాదేశ్‌లలో ప్రొపగాండిస్ట్ క్యాంపెయిన్లు నడిపారు.
4. యెమెన్, చైనా, రష్యాల్లో క్షిపణులు, ఆయుధాలు, సాయుధ డ్రోన్లు, బాంబుల తయారీ సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు క్లాడ్ ఏఐని వాడుకోవాలని చూశారని కంపెనీ బయటపెట్టింది.

అడ్డుకున్న విధానం - భద్రతా చర్యలు:
ఏఐ మోడల్స్ దుర్వినియోగానికి గురికాకుండా ఆంథ్రోపిక్ నిరంతరం అంతర్గతంగా దర్యాప్తు చేస్తూనే ఉంది. ఇలాంటి మాల్‌వేర్, హానికర కార్యకలాపాలకు పాల్పడిన అనుమానిత అకౌంట్లను వెంటనే గుర్తించి శాశ్వతంగా బ్యాన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. తమ మోడల్స్ మరింత శక్తివంతంగా మారుతున్న కొద్దీ వాటి రిస్కులు కూడా పెరుగుతాయని, దీనిని అడ్డుకోవడానికి ఏఐ డెవలపర్లు, ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆంథ్రోపిక్ సంస్థ పేర్కొంది. ప్రపంచ అంతం వంటి సైన్స్ ఫిక్షన్ భయాల కంటే.. ప్రస్తుత వాస్తవ ప్రపంచంలో ఏఐని ఆయుధాలుగా మలుస్తున్న ముప్పులపైనే వెంటనే దృష్టి పెట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.