పాశిగామ పాఠశాలకు బెంచీలు.. రూ.18 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులు: ఎంపీ వంశీకృష్ణ

పాశిగామ పాఠశాలకు బెంచీలు.. రూ.18 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులు: ఎంపీ వంశీకృష్ణ

జగిత్యాల జిల్లా: వెల్గటూర్ మండలం పాశిగామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బెంచీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొని విద్యార్థులకు బెంచీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, కాడే సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాకా స్ఫూర్తితో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో పాఠశాలలకు బెంచీలు, బోర్‌వెల్స్, ఉపాధ్యాయులను ట్రస్ట్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు.

తాను గతంలో పాశిగామ పాఠశాల ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన సమయంలో విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూసి బాధపడ్డానని వంశీకృష్ణ తెలిపారు. విద్యార్థుల సమస్యను దృష్టిలో ఉంచుకుని విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాఠశాలకు బెంచీలు అందించినట్లు పేర్కొన్నారు.

ALSO READ : మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం.. 

పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు రూ.18 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ వంశీకృష్ణ ప్రకటించారు. ఈ నిధులతో అదనపు తరగతి గదుల భవనం నిర్మించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను కోరారు.

విద్యార్థులు అందరూ మంచిగా కష్టపడి చదువుకోవాలని ఎంపీ సూచించారు. ఉన్నతంగా ఎదిగి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.