తెలుగు భాష ఓ ప్రవహించే నదిలాంటిది. కాలానుగుణంగా ఎన్నో దేశాలు, సంస్కృతులు, రాజ్యాల ప్రభావాన్ని స్వీకరిస్తూ భాషాపరంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ ఎదిగింది. తెలుగు భాషలో మనం రోజువారీగా ఉపయోగించే చాలా పదాలు సంస్కృతం, ప్రాకృతం, ఇతర అన్యదేశ భాషల (ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్) నుంచి వచ్చినవే. పోర్చుగీసు, బ్రిటీష్, పర్షియన్ల పాలనలో ఇవి మన తెలుగు భాషలో కలిసి పోయాయి. ఈ రోజు మనం అనేక ఉర్దూ, అరబిక్, ఇంగ్లీషు పదాలను వాటి తెలుగు అర్థాల గురించి ఆలోచించకుండానే ఉపయోగిస్తున్నాం.
పోర్చుగీస్ పదాలు
16వ శతాబ్దంలో పోర్చుగీస్ వ్యాపారులు మన దేశానికి వచ్చినప్పుడు వారు తెచ్చిన వస్తువులతో పాటు వారి భాషా పదాలు కూడా తెలుగులోకి వచ్చాయి. అలమర, మేజా, సబ్బు, ఇస్త్రీ, తువ్వాలు, జపాను, బాతు, మేజోడు, తాళం, తాళంచెవి, వరండా, పైనాపిల్, పొగాకు, బకెట్, రిబ్బన్ మొదలైన అనేక పోర్చుగీసు పదాలు ఇప్పుడు మన తెలుగులో భాగమయ్యాయి..వాటిని మనం ఇప్పుడు రోజు విస్తృతంగా వినియోగిస్తున్నాం.
ఇంగ్లీషు పదాలు
అంతేకాదు బ్రిటిష్ పాలనలో కూడా అనేక ఆంగ్ల పదాలు మన రోజువారీ సంభాషణలలో భాగమయ్యాయి. ఈ పదాలు మన నాలుకలలో ఎంతగా నాటుకుపోయాయంటే, బ్రిటిష్ వారు వెళ్ళిపోయినా కూడా ఈ పదాలు మిగిలిపోయాయి. నంబర్, బస్సు, క్రికెట్, టికెట్, రైలు, స్టేషన్, పాస్, ఫెయిల్, డాక్టర్, ఇంజనీర్, ఆఫీసర్, టైమ్, బ్యాటరీ, లైట్, సైకిల్, బిల్, రసీదు, పోస్టర్, పర్స్, శాండల్ మొదలైనవి. ఈ రోజు మనం అనేక ఆంగ్ల పదాలను వాటి తెలుగు అర్థాల గురించి ఆలోచించకుండానే ఉపయోగిస్తున్నాం.
అదేవిధంగా ఫకీర్, తివాచీ, ఫిరంగి మొదలైన టర్కిష్ భాషా పదాలు కూడా మన వాడుక భాషలో భాగమయ్యాయి. ఈ పదాలు వేరే భాషకు చెందినవి, కానీ అవి మన రోజువారీ తెలుగులో ఎంతగా కలిసిపోయాయంటే, చాలా మంది తాము తెలుగు అనుకుని మాట్లాడుతున్నది నిజానికి ఒక విదేశీ భాష అని కూడా గ్రహించలేనంతగా.
ఉర్దూ / పర్షియన్ / అరబిక్ పదాలు
ముస్లిం రాజుల పరిపాలన (కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు) కాలంలో పరిపాలన, న్యాయవ్యవస్థకు సంబంధించిన ఎన్నో పదాలు తెలుగులో భాగమయ్యాయి.
రోజు, అసలు, తయారు, చిరునామా,కలం, కాగితం, జవాబు, ఖర్చు వంటి పదాలు తెలుగులో విడదీయరానంతగా ఉండిపోయాయి.రోజు అనే పదం పర్షియన్ పదం రోజ్ నుంచి వచ్చింది. అసలు అనే పదం అరబిక్ పదం అసల్ నుంచి, తయారు అనేది ఉర్దూ పదం తైయార్ నుంచి వచ్చింది. ఖర్చు పదం ఉర్దూ/పర్షియన్ పదం ఖర్చ్ నుంచి తెలుగులో భాగమయ్యింది.
తెలుగు భాష ఓ ప్రవహించే నదిలాంటిది. కాలానుగుణంగా ఎన్నో దేశాలు, సంస్కృతులు, రాజ్యాల ప్రభావాన్ని స్వీకరిస్తూ మరింత సమృద్ధిగా ఎదిగింది. అందుకే మనం మాట్లాడేది కేవలం తెలుగు మాత్రమే కాదు..చరిత్రను, సంస్కృతులను, అనేక భాషల ముద్రను తనలో దాచుకున్న సజీవ తెలుగు. విదేశీ మూలం ఉన్నా, ప్రజల నోట నిత్యం వినిపించే ప్రతి పదం చివరికి మన భాషలో భాగమే.
