రామచిలుకని చూస్తే అది చేసే అల్లరి, మాటలు ఆనందాన్ని ఇస్తాయి. కానీ, ఏదైనా ఒక రామచిలుకకి పేరు పెట్టాలని అనుకున్నప్పుడే అసలు డౌట్ వస్తుంది. ఏంటంటే... రామచిలుక మగదా లేక ఆడదా అని కనిపెట్టడం కొంచెం కష్టమైన పనే. అయితే, కొన్ని సింపుల్ ట్రిక్స్ ద్వారా తెలుసుకోవడం సాధ్యమే.. అవేంటో ఒకసారి చూసేద్దాం!
1. మెడలో వలయం
మగ, ఆడ రామచిలుకల మధ్య కనిపించే అతిపెద్ద తేడా వాటి మెడ చుట్టూ ఉండే రింగ్. మగ చిలుకకు సుమారు ఒకటిన్నర నుండి మూడేళ్ల వయసు వచ్చేసరికి, దాని మెడ చుట్టూ ముదురు నలుపు, గులాబీ లేదా ఎరుపు రంగులో ఒక నల్లటి చార ఏర్పడుతుంది. దీన్నే మనం 'కంఠి' అంటాం. అదే ఆడ చిలుకల మెడపై మాత్రం అటువంటి ముదురు వలయాలు ఉండవు. అసలు ఏమీ ఉండకపోవచ్చు లేదా చాలా పల్చగా ఆకుపచ్చ/బూడిద రంగు నీడలా కనిపిస్తుంది.
2. తోక పొడవు
రామచిలుకలను కాస్త దగ్గరగా గమనిస్తే వాటి తోకల్లోనూ తేడా తెలుస్తుంది. మగ చిలుకల తోక మధ్యలో ఉండే ఈకలు కాస్త పొడవుగా ఉంటాయి. అదే ఆడ రామచిలుకల తోకలు మగ వాటితో పోలిస్తే కొద్దిగా పొట్టిగా కనిపిస్తాయి.
3. రంగుల మెరుపు
ఈ రెండు రామచిలుకలు చూడటానికి ఆకుపచ్చగానే ఉన్నా, ఆడదానితో పోలిస్తే మగ రామచిలుక రంగు మరింత ముదురుగా, ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా మగ చిలుక ముఖం దగ్గర ఈకలు ప్రత్యేకమైన షైనింగ్ తో ఉంటాయి. ఆడ చిలుకల రంగు మాత్రం కొద్దిగా తేలికగా, నిస్తేజంగా కనిపిస్తుంది.
ALSO READ : మీకు తెలుసా : రోజు మాట్లాడే ఈ పదాలు తెలుగు కాదా..
4. స్వభావం, మాటలు
శరీర లక్షణాలతో పాటు వాటి ప్రవర్తన కూడా చాలా విషయాలు చెబుతుంది. మగ చిలుకలు కాస్త ఎక్కువగా అరుస్తాయి, చురుగ్గా మాట్లాడతాయి. మనుషుల గొంతును, పదాలను త్వరగా ఒంటబట్టించుకుని అల్లరి చేస్తాయి. ఇక ఆడ రామచిలుకలు సాధారణంగా కాస్త శాంతంగా ఉంటాయి. కానీ వాటి గూడును మాత్రం ఎవరికీ చిక్కకుండా చాలా జాగ్రత్తగా కాపలా కాస్తాయి. అవసరమైతే ఎదురుతిరిగేలా కూడా ప్రవర్తిస్తాయి.
