రూపాయి రుచి మరిగిన ఒక హైదరాబాద్ వ్యక్తికి కోర్టు భారీ షాకే ఇచ్చింది. పది రూపాయల పేపర్ క్యారీ బ్యాగ్ కోసం వేసిన కేసుతో ఏకంగా పది వేల రూపాయల జరిమానా కట్టాల్సి రావటంతో సదరు వ్యక్తి అవాక్కయ్యాడు. పట్టుదల పేరుతో కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేసే అలవాటు ఉన్న ఆ హైదరాబాదీ ఆటలు బెంచ్ ముందు సాగలేదు. కన్జూమర్ కోర్టులో జరిగిన వింత కేసు గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..
హైదరాబాద్‌కు చెందిన సురేష్ కుమార్ అమృతలూరి గతంలోనూ క్యారీ బ్యాగ్ కి డబ్బులు వసూలు చేశారనే విషయమై ఓ సారి కోర్టును ఆశ్రయించి విజయం సాధించాడు. ఇక అదే ఉత్సాహంతో మార్చి 10, 2025న షాపర్స్ స్టాప్‌లో బట్టలు కొన్నప్పుడు తీసుకున్న రూ.10 పేపర్ క్యారీ బ్యాగ్ బిల్లును సాకుగా చూపాడు. క్యారీ బ్యాగ్ వివరాలు లేవంటూ.. లీగల్ మెట్రాలజీ రూల్స్ ఉల్లంఘించారంటూ ఏకంగా 4 కోట్ల రూపాయలకు పరిహారం కోరాడు. ఇందులో 90 శాతం సొమ్మును కన్స్యూమర్ కోర్టుల ఆధునికీకరణకు.. మిగిలిన 10 శాతం తనకు నష్టపరిహారంగా ఇవ్వాలని విచిత్రమైన డిమాండ్ పెట్టాడు.
ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన హైదరాబాద్ జిల్లా కన్స్యూమర్ కమిషన్ అధ్యక్షుడు వక్కంటి నరసింహారావు, సభ్యులు పి.వి.టి.ఆర్. జవహర్ బాబు, సుమ వాలాలతో కూడిన ధర్మాసనం సురేష్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. షాపర్స్ స్టాప్ దుకాణంలో క్యారీ బ్యాగ్‌లకు చార్జీలు ఉంటాయని స్పష్టంగా బోర్డులు పెట్టడాన్ని, పైగా గతంలోనూ ఇదే తరహా కేసు వేసిన అనుభవం ఉన్న సురేష్‌కు క్యారీ బ్యాగ్ విషయాలు ముందే తెలుసని కమిషన్ గుర్తించింది. తాను కొనుగోలు చేసే సమయంలో సంచి వెంట తెచ్చుకోకుండా.. ఉద్దేశపూర్వకంగానే వివాదం సృష్టించాలని కోర్టు గ్రహించింది.
కేవలం షాపర్స్ స్టాప్ మాత్రమే కాకుండా.. గతంలో విజేత సూపర్ మార్కెట్, ఎయిర్‌టెల్, మేక్‌మైట్రిప్, ఖతార్ ఎయిర్‌వేస్ వంటి పలు సంస్థలపై కూడా ఇలాంటి ఫిర్యాదులే చేసినట్లు కోర్టు పరిశీలనలో తేలింది. సురేష్ సామాజిక కార్యకర్త కాదని.. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం, బెదిరింపులతో లబ్ది పొందడమే లక్ష్యంగా పెట్టుకున్న హాబిచువల్ లిటిగెంట్ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. చట్టం కల్పించిన సౌలభ్యాన్ని సొంత ప్రయోజనాలుగా మలుచుకుంటూ.. కోర్టుల విలువైన సమయాన్ని వృథా చేస్తున్నాడని మండిపడింది.
ఈ నేపథ్యంలో సురేష్ దాఖలు చేసిన పిటిషన్‌లో ఎలాంటి నిజాయితీ లేదని తేల్చిచెప్పిన కమిషన్ దాన్ని కొట్టివేసింది. అంతేకాకుండా.. కోర్టును తప్పుదోవ పట్టించి అనవసర వేధింపులకు పాల్పడినందుకు అతనికి రూ.10వేలు జరిమానా విధించింది. ఇందులో రూ.5వేలు రిటైలర్ షాపర్స్ స్టాప్‌కు చెల్లించాలని, మిగతా రూ.5వేలు కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్‌లో డిపాజిట్ చేయాలని 45 రోజులు టైం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టులను వాడుకునే వారికి ఫైన్ వేయటం సరైనదేనని, అప్పుడే ఇలాంటి వారి ఆటలకు అడ్డు పడుతుందని నెటిజన్లు కూడా ఈ కేసు తీర్పుపై స్పందిస్తున్నారు.
