మీరు FASTag వాడుతున్నారా..? బ్యాంకు అకౌంట్ సమస్య వచ్చినప్పుడు వేరే బ్యాంకుకు మారాలంటే ఎన్ని ఇబ్బందులో తెలిసే ఉంటుంది. ఫాస్ట్ ట్యాగ్ డీయాక్టివేట్ చేసి.. మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని కొత్త బ్యాంకు అకౌంట్ లింక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక నుంచి ఆ అవసరం లేదు. డీయాక్టివేట్ చేయకుండానే బ్యాంక్ అకౌంటును మార్చుకునే సదుపాయం కల్పి్స్తోంది. అందుకు సంబంధించి వన్ ట్యాగ్ (One Tag) ను ప్రారంభించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
NETC FASTag పోర్టబిలిటీ సొల్యూషన్ అయిన OneTagను ప్రారంభించారు మంత్రి. FASTag యూజర్లు తమ ప్రస్తుత NETC FASTagను కొనసాగిస్తూనే, తమ ఇష్యూయర్ బ్యాంక్‌ను సులభంగా మార్చుకోవచ్చు. NHAI ప్రమోట్ చేసిన ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ల చొరవతో OneTag ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2026 సందర్భంగా గడ్కరీ OneTagను ప్రారంభించారు.
రాజమార్గయాత్ర మొబైల్ యాప్‌లో అందుబాటులోకి
వన్ ట్యాగ్ సదుపాయం ప్రస్తుతం NHAI కి చెందిన రాజమార్గయాత్ర మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. యూజర్లు ఈ యాప్ ద్వారా ఫాస్టాగ్ పోర్టబిలిటీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సిస్టమ్ మొదట యూజర్ ఎలిజిబిలిటీని తనిఖీ చేసి, ఆ తర్వాత ప్రైవసీ ప్రొటెక్షన్ కన్ ఫామ్ చేస్తుంది. యూజర్ అంగీకారం తెలిపిన తర్వాత .. తమకు నచ్చిన కొత్త బ్యాంకును ఎంచుకోవచ్చు. బ్యాంకుు మార్చుకున్న తర్వాత కొత్త బ్యాంకుతో ఆన్‌బోర్డింగ్ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా, పోర్టబిలిటీ తర్వాత ఫాస్టాగ్ ట్యాగ్ ఐడి, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే ఉంటాయి, అంటే వాహనంలో ఇన్‌స్టాల్ చేసిన పాత ఫాస్టాగ్ పనిచేస్తూనే ఉంటుంది.
బ్యాలెన్స్ పరిస్థితేంటి..?
బ్యాంకు ట్రాన్స్ ఫర్ సమయంలో, అథెంటికేషన్, వాలెట్ బ్యాలెన్స్, రీఫండ్‌లు, పెండింగ్ లావాదేవీలు, ఇతర సంబంధిత విషయాలతో సహా పాత వాలెట్‌కు సంబంధించిన అన్ని విషయాలను పాత బ్యాంకు చూసుకుంటుంది. పోర్టబిలిటీ పూర్తయిన తర్వాత, కొత్త బ్యాంకు యూజర్ ఆన్‌బోర్డింగ్‌ను పాత బ్యాంకు పూర్తి చేస్తుంది.
ప్రయోజనాలు ఇవే:
వన్‌ట్యాగ్ యూజర్లు తమకు నచ్చిన బ్యాంకును ఎంచుకునే సదుపాయం కల్పిస్తుంది. దీనివల్ల, వాహనాలకు పదేపదే కొత్త ఫాస్టాగ్‌లను జారీ చేయించి, అతికించాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే, ఫాస్టాగ్‌లను రీ ప్రింట్ చేయడం, ట్రాన్స్ పోర్ట్ చేయడం, ఇన్సురెన్స్ మళ్లీ చేయడం వంటి వాటికి అయ్యే ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాలకు ఆన్‌లైన్ ఫాస్టాగ్ లోకల్ పాస్‌ల సౌకర్యాన్ని విస్తరించింది. అర్హులైన ప్రయాణికులు రాజమార్గయాత్ర మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నెలవారీ లోకల్ పాస్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.
