నిజామాబాద్, వెలుగు: వానాకాలం సాగు చేసిన వరి కోతలు మొదలయ్యే అక్టోబర్ మొదటి వారంలోనే జిల్లాలో వడ్ల కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేస్తామని నిజామాబాద్కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. ఈ సీజన్లో 6.50 మెట్రిక్ టన్నుల వడ్లు వచ్చే సూచనలు ఉన్నందున 736 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, అందులో 249 కేంద్రాలను మహిళలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములను గుర్తించాలని తహసీల్దార్లకు సూచించారు.
మార్కెట్ కమిటీలు, స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో స్టాక్ పెట్టిన మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్ ఖాళీ చేయించాలన్నారు. ప్రభుత్వం గుర్తించిన సన్న రకం వడ్లను సర్కార్ సెంటర్లకే రైతులు తెచ్చేలా అవగాహన కల్పించాలని, గన్నీ బ్యాగ్‌లు, హమాలీలను తగిన సంఖ్యలో సమకూర్చుకోవాలని, తేమ కొలిచే యంత్రాలు సిద్ధంగా పెట్టుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయకుమారి, డీఆర్డీవో సాయన్న, డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ డీఎం ప్రవీణ్ ఉన్నారు.
