- హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులోని కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు
హైదరాబాద్, వెలుగు: కోల్‌కతాలో జరిగిన బొగ్గు స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులోని బొగ్గు కాంట్రాక్ట్ కంపెనీలతో పాటు ఆయా సంస్థల యజమానుల ఇండ్లు, కార్యాలయాలలో శుక్రవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ కమల్ పురి కాలనీలోని ఏ.మహేశ్‌రెడ్డి, ఆయన కుటుంబం ప్రమోట్ చేస్తున్న ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.
ఎస్‌ఆర్‌ఈఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్, ఎస్‌ఆర్‌ఈఐ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి తీసుకున్న రుణాల్లో అవకతవకలు, వాటి తిరిగి చెల్లింపులో వైఫల్యానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. కాగా, ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ మైనింగ్, కాంట్రాక్ట్ మైనింగ్, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, సివిల్ కన్‌స్ట్రక్షన్, పారిశ్రామిక మౌలిక వసతుల రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
