పుతిన్ కారు చక్రాలపై కంచుకోట.. స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా రష్యా అధ్యక్షుడి కారు, ప్లేన్

పుతిన్ కారు చక్రాలపై కంచుకోట.. స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా రష్యా అధ్యక్షుడి కారు, ప్లేన్

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 18వ బ్రిక్స్ సదస్సు కోసం శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, ఈ పర్యటనలో ఆయన వాడిన కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాని పేరు ఆరస్ సెనాట్. ఇది బుల్లెట్ ప్రూఫ్, పేలుడు నిరోధక లగ్జరీ లిమోసిన్ కారు. దీని ధర సుమారు 18 మిలియన్ రూబుల్స్ (రూ. 2.5 కోట్లు).

గతంలో ప్రధాని  మోదీ కూడా చైనాలో పుతిన్‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఈ కారులో ప్రయాణించారు. ఆరస్ సెనాట్ లిమోసిన్ కారును రష్యాకు చెందిన 'ఆరస్ మోటార్స్' సంస్థ తయారు చేసింది. దీనిని 'ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్(చక్రాలపై కవచం కలిగిన కోట)' అని పిలుస్తారు. ఈ కారు తయారీలో రష్యా ప్రభుత్వ సంస్థతో పాటు యూఏఈ సంస్థ కూడా భాగస్వామిగా ఉంది.

సోవియట్ కాలపు కార్ల స్ఫూర్తితో 2018లో ఔరస్ సెనాట్ కారును రూపొందించారు. దీని సాధారణ వెర్షన్ కూడా పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంది. పుతిన్ వాడే కారు మాత్రం అత్యున్నత భద్రతా ప్రమాణాలతో పూర్తి సాయుధ వాహనంగా ఉంటుంది. ఈ కారు 5,630 మిమీ పొడవు, 2,000 మిమీ వెడల్పు, 1,700 మిమీ ఎత్తును కలిగి ఉంది. దీని వీల్‌‌‌‌‌‌‌‌బేస్ 3,300 మిమీ. దీని గరిష్ట వేగం గంటకు సుమారు 160 కిలోమీటర్లుకాగా..ఇది దాదాపు 9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.  

డూమ్స్‌‌‌‌‌‌‌‌ డే ప్లేన్‌‌‌‌‌‌‌‌లో రాక..
పుతిన్ "ఫ్లయింగ్ క్రెమ్లిన్".. "డూమ్స్‌‌‌‌‌‌‌‌డే ప్లేన్" అని పిలిచే ప్రత్యేక విమానంలో భారత్‌‌‌‌‌‌‌‌కు వచ్చారు. పుతిన్ ఏ విమానంలో వస్తున్నారో ఎవరికీ తెలియకుండా ఉండటానికి ఒకేలా ఉండే రెండు విమానాలను ఒకే సమయంలో గాల్లోకి పంపే వినూత్న భద్రతా వ్యూహాన్ని రష్యా అనుసరించింది. ఈ ప్రత్యేక విమానం పేరు ఇట్యూషిన్ ఐఎల్-96-300పీయూ.

1980లో ఇట్యూషిన్ డిజైన్ బ్యూరో దీనిని రూపొందించింది. ఇది అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడికి పూర్తి మొబైల్ కమాండ్ సెంటర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తుంది. ఈ నాలుగు ఇంజిన్ల విమానం నిరంతరాయంగా 11 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. మధ్యలో  ఇంధనం నింపాల్సిన అవసరం ఉండదు. దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే.. ఈ విమానం లోపల నుంచే సైనిక, నిఘా, ప్రభుత్వ శాఖలతో అత్యంత సురక్షితంగా మాట్లాడే ఏర్పాట్లు ఉన్నాయి.