- బీసీల ధర్మ పోరాట దీక్షలో జాజుల శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్య
- బీసీలను మనుషులుగా కూడా గుర్తించడం లేదు: మధుసూదనాచారి
ముషీరాబాద్, వెలుగు: కులగణనలో బీసీగణన చేపట్టకపోతే కేంద్రంలో బీజేపీనీ గద్దె దించుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కులగణన ప్రశ్నావళిలో బీసీ కాలమ్ చేర్చకుండా ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించకుండా బీసీలను కేంద్రం నమ్మించి వంచిస్తున్నదని మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చి..ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీసీల ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు వి. హనుమంతరావు, బీఆర్ఎస్ శాసనమండలి పక్ష నేత మధుసూదనాచారి, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. జాజుల మాట్లాడుతూ..అఖిలపక్ష పార్టీలు, సామాజిక నిపుణులతో సమావేశమయ్యాకే జనగణన ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నెల 20న హైదరాబాద్ లో బీసీ కులగణనపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని.. ఆ సదస్సులో దేశవ్యాప్తంగా మరో మండల్ ఉద్యమానికి రూపకల్పన చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే నెలలో లక్షలాది మందితో పార్లమెంట్ ముట్టడిస్తామని పేర్కొన్నారు.
ఢిల్లీలో భారీ సభ పెడ్తం
వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ..కులగణనలో బీసీ కాలమ్ చేర్చకుంటే ఢిల్లీలో లక్షలాది మందితో బహిరంగ సభ పెడ్తామని హెచ్చరించారు. మధుసూదనా చారి మాట్లాడుతూ.. బీసీలను ప్రభుత్వాలు మనుషులుగా కూడా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. నెల్లికంటి సత్యం మాట్లాడుతూ..బీసీ లెక్కలు తీయని బీజేపీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
