కరీంనగర్, వెలుగు: ఆస్తి వివాదం నేపథ్యంలో రోకలిబండతో తల్లిని హత్య చేసి, తమ్ముడిపై హత్యాయత్నం కేసులో నేరస్తుడు అగుర్ల లింగయ్యకు కోర్టు జీవిత ఖైదు విధించింది. రూ.10 వేలు జరిమానా కూడా వేసింది. 2022 అక్టోబర్ 24న కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇరుకుల్లకు చెందిన అగుర్ల లింగయ్య తనకు రావాల్సిన భూమి వాటాను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని తల్లి, తమ్ముడిని డిమాండ్ చేస్తూ గొడవకు దిగాడు. కోపంతో రోకలిబండతో వారి తలలపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
దీంతో తల్లి అక్కడికక్కడే చనిపోగా, తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు 302, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తు, ఆధారాల సమర్పణతో నేరం రుజువు కావడంతో ఫ్యామిలీ కోర్టు అండ్ నాలుగో అడిషనల్ జిల్లా, సెషన్స్ కోర్టు లింగయ్యకు జీవిత ఖైదు శిక్ష విధించింది. నేరస్తుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను సీపీ గౌష్ ఆలం అభినందించారు.
