- 12.91 లక్షల మందికి లబ్ధి కౌన్సిల్లో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: రూపాయి ఖర్చు లేకుండా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఉచిత ప్రమాద బీమా అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం కౌన్సిల్లో ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే 89 ఉద్యోగ కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారాన్ని అందించినట్లు తెలిపారు. ఇందులో సింగరేణిలో 50, విద్యుత్ శాఖ ఉద్యోగులు 15, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు 24 మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 12,91,046 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వ్యవస్థకు ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు.
ఇందులో 5,18,293 మంది రెగ్యులర్ ప్రభుత్వ సిబ్బంది, 5,00,158 మంది తాత్కాలిక సిబ్బంది, 2,72,615 మంది పెన్షనర్లు కవర్ అవుతారని వివరించారు. ఈ పథకాన్ని తొలుత ఫిబ్రవరి 2024లో సింగరేణి ఉద్యోగులకు, ఆ తర్వాత జూన్ 2024 నుంచి విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రారంభించి, ప్రస్తుతం రాష్ట్రంలోని కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పాటు అందరికీ వర్తింపజేశామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని శాఖల అధిపతులకు, కార్యదర్శులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని సభకు వివరించారు.
