బిహార్ లో ఇంకా వరద బీభత్సం కొనసాగుతోంది. గంగా, కోసి గండక నదులు ఉధృతంగా ప్రవహిస్తుండంతో వరదలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 15 జిల్లాల్లో 47.33 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. నదుల నీటి మట్టం పెరుగుతుండటంతో చాలాచోట్ల డ్యామ్ లు, ఆనకట్టలు తెగిపోయాయి. భాగల్పూర్ జిల్లాలో నాలుగు ఆనకట్టలు తెగిపోగా, గోపాల్ పూర్ బ్లాక్ బ్రహ్మోత్తర డ్యాంకు గండి పడింది.
పాట్నాలోని గాంధీ ఘాట్ గంగానది మునుపటి రికార్డును అధిగమించింది. సోన్, ఘాగ్రా నదులలో అనూహ్యంగా నీటిమట్టం పెరగడంతో గాంధీ ఘాట్ దగ్గర గంగా నది నీటిమట్టం 2016లో నమోదైన గరిష్ట స్థాయిని దాటిందని, ఇంకా పెరుగుతూనే ఉందని అధికారులు తెలిపారు.
బీహార్‌లోని అనేక ప్రధాన నదులన్నీ ప్రమాద స్థాయిలను మించి ప్రవహిస్తున్నాయి.గంగా, గండక్, కోసి నదుల్లో వరదనీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంది.దుమ్రియా ఘాట్ వద్ద గండక్ నది ,బల్తారా ,కుర్సెలా దగ్గర కోసి నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. . ఖగారియా దగ్గర బుర్హి గండక్ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది.
సెప్టెంబర్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం..
బిహార్ లో సెప్టెంబర్ లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయింది. ఇప్పటివరకు 104.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇది సాధారణం కంటే సుమారు 27 శాతం అధికం. రాబోయే రెండు రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని బిహార్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
