టెక్కీలకు బ్యాడ్ న్యూస్.. లేఆఫ్స్ కోసం రూ.6వేల 700 కోట్లు సిద్ధం చేసుకున్న ఒరాకిల్!

టెక్కీలకు బ్యాడ్ న్యూస్.. లేఆఫ్స్ కోసం రూ.6వేల 700 కోట్లు సిద్ధం చేసుకున్న ఒరాకిల్!

టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోన్న ఒరాకిల్ ఏఐ ప్లాన్స్ మరోసారి ఉద్యోగుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. AI రంగంలో ఆధిపత్యం కోసం చేపట్టిన భారీ డేటా సెంటర్ల నిర్మాణాలు ఆ కంపెనీ ఖజానాకు చిల్లులు పెట్టాయి. ఈ క్యాష్ క్రంచ్ దెబ్బకు విలవిల్లాడుతున్న ఈ సంస్థ.. ఖర్చులు తగ్గించుకునే పేరుతో వేల మంది ఉద్యోగుల లేఆఫ్స్ కి సర్వం సిద్ధం చేసుకుంది. ఏఐ కలలను సాకారం చేసుకునే క్రమంలో ఏకంగా వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేసేందుకు తన ప్లాన్స్ మరింతగా విస్తరించింది. 

ఈ భారీ లేఆఫ్స్ వ్యూహంలో భాగంగా ఒరాకిల్ ఏకంగా 2.8 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.26వేల 600 కోట్లతో భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో ఇప్పటికే దాదాపు 2.1 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.19వేల 950 కోట్లు సెవరెన్స్ పేమెంట్ల రూపంలో ఖర్చు చేయగా.. తాజాగా మరో 700 మిలియన్ డాలర్లు అంటే రూ.6వేల 650 కోట్లు తొలగింపుల కోసం సిద్ధం చేసుకుందట. కేవలం సిబ్బందిని తొలగించడానికే ఈ స్థాయిలో వేల కోట్లు ఖర్చు పెడుతుండటం చూస్తే టెక్నాలజీ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదే క్రమంలో కంపెనీ బోర్డులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. దాదాపు 40 శాతం వాటాలున్న చైర్మన్ లారీ ఎల్లిసన్, జూన్ 22 నాటి షేర్ల విలువ ప్రకారం రూ.83వేల 183 కోట్ల విలువైన 50 మిలియన్ల షేర్లను అమ్ముకునేందుకు ప్లాన్ వేశారు. అప్పట్లో ఒక్కో షేరు రూ.16వేల 631 ఉండగా.. ఆ తర్వాత మార్కెట్ పతనంతో షేర్ విలువ 16 శాతం పడిపోయింది. కొడుకు డేవిడ్ ఎల్లిసన్ చేపట్టిన భారీ మీడియా టేకోవర్ల కోసం లారీ ఎల్లిసన్ వెనుక ఉండి ఆర్థికంగా బలమైన అండగా నిలుస్తుండటం గమనార్హం.

ఈ తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా ఒరాకిల్ ఇప్పటికే తన ఉద్యోగుల సంఖ్యను దారుణంగా కుదించేసింది. కేవలం ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 21వేల మందిని ఇంటికి సాగనంపింది. ప్రస్తుతం అమెరికాలో 49వేల మంది, అంతర్జాతీయంగా 92వేల మంది మాత్రమే మిగిలారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హిలారీ మాక్సన్ దీన్ని 'సరళీకరణ చర్యలు' అని కొట్టిపారేస్తున్నా.. ఉద్యోగుల పాలిట మాత్రం ఇది ఉరిత్రాడనే చెప్పవచ్చు.

ఓపెన్‌ఏఐ వంటి దిగ్గజాలకు ఏఐ సేవలు అందించే క్రమంలో ఒరాకిల్ చేసిన అతిపెద్ద సాహసమే ఇప్పుడు ఈ ముప్పునకు కారణమైంది. మార్జిన్లను రక్షించుకోవడానికి, ఖర్చులను కట్టడి చేయడానికి కంపెనీ చేస్తున్న ఈ కఠినమైన నిర్ణయాలు టెక్ ఉద్యోగులను కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ లేఆఫ్స్ సునామీ ఎంత మంది ఉద్యోగాలను బలితీసుకుంటుందో అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్కీలు తీవ్ర భయాందోళనలతో వణికిపోతున్నారు. ప్రధానంగా భారతదేశంలో వేల సంఖ్యలో పనిచేస్తున్న టెక్ ఫ్యామిలీస్ ఏ క్షణం జాబ్స్ పోతాయో అనే గందరగోళంలో ఉన్నారు.