సెలక్షన్‌లో తప్పులు.. పదవికే ఎసరు! బీసీసీఐ తొలగించిన భారత సెలెక్టర్లు వీరే.. అగార్కర్ సంగతేంటి?

సెలక్షన్‌లో తప్పులు.. పదవికే ఎసరు! బీసీసీఐ తొలగించిన భారత సెలెక్టర్లు వీరే.. అగార్కర్ సంగతేంటి?

బీసీసీఐ (BCCI) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలం ఈ సెప్టెంబర్‌తో ముగియనుండటంతో అతడ్ని తప్పించి కొత్త చీఫ్ సెలెక్టర్‌ను నియమించేందుకు బోర్డు వేట ప్రారంభించింది. జూలై 2023లో బాధ్యతలు చేపట్టిన అగార్కర్.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్ అందించిన వెంటనే రోహిత్ శర్మ (వన్డే), సూర్యకుమార్ యాదవ్ (టీ20)లను కెప్టెన్సీల నుంచి తొలగించడం వంటి తీవ్ర వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. కోహ్లీ, రోహిత్‌లను టెస్టుల నుంచి రిటైర్ అయ్యేలా చేయడం, షమీని పక్కన పెట్టడం ఆయన పదవికే ఎసరు తెచ్చింది. కానీ బీసీసీఐ చేతిలో బలైన ముగ్గురు చీఫ్ సెలెక్టర్ల చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.. 

స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన చేతన్ శర్మ: 

టీ20 వరల్డ్ కప్‌లలో వరుస వైఫల్యాల తర్వాత 2022 నవంబర్‌లో చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీని బీసీసీఐ రద్దు చేసింది. కానీ జనవరి 2023లో ఆయన్ను మళ్లీ రీ-జాయిన్ చేసినప్పటికీ.. ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయారు. కోహ్లీ-గంగూలీ వివాదం, బుమ్రా గాయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కెమెరాకు దొరికిపోవడంతో అప్పటి బీసీసీఐ కార్యదర్శి జై షా ఆయన రాజీనామాను ఆమోదించాల్సి వచ్చింది.

బోర్డు పెద్దలతో కృష్ణమాచారి శ్రీకాంత్ ఘర్షణ: 

2008లో నియమితులైన కృష్ణమాచారి శ్రీకాంత్.. 2011 వరల్డ్ కప్ అందించినప్పటికీ, ఆ తర్వాత ఇంగ్లాండ్ (4-0), ఆస్ట్రేలియా (3-0) టెస్టుల్లో ఘోర పరాజయం తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ ఓటములకు ఐపీఎల్, బిజీ షెడ్యూలే కారణమని శ్రీకాంత్ వ్యాఖ్యానించగా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఫలితంగా సెప్టెంబర్ 2012లో ఆయన నాలుగేళ్ల పదవీ కాలం ముగియడంతో ఎలాంటి ఎక్స్‌టెన్షన్ ఇవ్వకుండా బీసీసీఐ సాగనంపింది.

ధోనిని తీసేయాలన్నందుకు మొహిందర్ అమర్‌నాథ్ పై వేటు: 

2011 సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన మొహిందర్ అమర్‌నాథ్‌ను కేవలం ఏడాదికే (సెప్టెంబర్ 2012) బీసీసీఐ ఊడబీకింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాజయం తర్వాత ఎంఎస్ ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని అమర్‌నాథ్ పట్టుబట్టగా, దానికి భారత క్రికెట్ బోర్డు పెద్దలు అడ్డుకున్నారు. గతంలో సెలెక్టర్లను బంచ్ ఆఫ్ జోకర్స్ అని వ్యాఖ్యానించి బోర్డుతో విరోధం పెంచుకున్న అమర్‌నాథ్‌ను 83వ ఏజీఎమ్ సమావేశంలో నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఇక అగార్కర్ వైదొలగడం దాదాపు ఖాయమవడంతో, తదుపరి భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా బీసీసీఐ ఎవరిని సెలక్ట్ చేస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.