8 నెలలుగా జీతాలొస్తలే... ఆర్థిక ఇబ్బందుల్లో 104 ఔట్సోర్సింగ్ ఉద్యోగులు

8 నెలలుగా జీతాలొస్తలే... ఆర్థిక ఇబ్బందుల్లో 104 ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
  • డీఎంహెచ్​ఓ పరిధి నుంచి డీఎంఈకి మార్చడంతో ఇబ్బంది

 మెదక్, వెలుగు : రెగ్యులర్ గా డ్యూటీలు చేస్తున్నా జీతాలు చేతికి రాకపోవడంతో 104 కింద  నియామకమైన ఫార్మాసిస్ట్​లు, ల్యాబ్​టెక్నీషియన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీఎంహెచ్ వో పరిధిలో పనిచేసిన వీరిని జనవరిలో డీఎంఈ పరిధిలోకి మార్చారు. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో విడుదల కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 450 మంది ఫార్మాసిస్ట్ లు, ల్యాబ్ టెక్నీషియన్ల జీతాలు నిలిచిపోయాయి. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డీఎంహెచ్ఓ నుంచి  డీఎంఈ పరిధికి మార్చడంతో...

2008వ సంవత్సరంలో 104 సేవల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఫార్మాసిస్ట్​లు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది నియామకాలు చేపట్టారు. హెచ్ఎంఆర్ఐ కింద పనిచేసిన ఆ ఉద్యోగులను 2012లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) పరిధిలోకి మార్చారు.  తర్వాత ప్రభుత్వం 104 సేవలను నిలిపివేయడంతో ఈ ఉద్యోగులంతా గతేడాది డిసెంబర్​వరకు డీఎంహెచ్ఓ ఆఫీసులు, వాటి పరిధిలోని హాస్పిటల్స్ లో సేవలు అందించారు. 

తర్వాత అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు కావడంతో.. ఆయా ప్రాంతాల్లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను మెడికల్ కాలేజీలకు అనుబంధంగా టీచింగ్ హాస్పిటల్స్ గా మార్చారు. ఆ కేంద్రాల్లో ఉద్యోగులు, సిబ్బంది అవసరం ఏర్పడడంతో 104 కింద నియామకమైన వారిని జనవరిలో డీఎంహెచ్ వో పరిధి నుంచి డీఎంఈ పరిధిలోకి మార్చి జీజీహెచ్, ఎంసీహెచ్, మెడికల్​కాలేజీల్లో సర్దుబాటు చేశారు. 

కాగా, ఉద్యోగులను డీఎంఈ పరిధిలోకి మార్చినప్పటికీ ప్రభుత్వం నుంచి జీవో విడుదల కాలేదు. నాన్​టెక్నికల్ ఉద్యోగులైన డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన మ్యాపింగ్​ప్రక్రియ పూర్తి కావడంతో వారికి సక్రమంగానే జీతాలు అందుతున్నాయి. కానీ ఫార్మాసిస్ట్ లు, ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వీరికి ఎనిమిది నెలలుగా జీతాలు అందడం లేదు. ప్రభుత్వం స్పందించి తమకు పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించడంతో పాటు నెల నెలా సక్రమంగా అందేలా చూడాలని ఫార్మాసిస్ట్​లు, ల్యాబ్​టెక్నీషియన్లు కోరుతున్నారు.