హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ట్రక్కులు, లారీలపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. గ్రానైట్, కంకర, ఇసుకను తరలించే భారీ వాహనాలపై రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్ శివారులో పరిమితికి మించి గ్రానైట్‌ను తరలిస్తున్న నాలుగు భారీ లారీలను సీజ్ చేశారు. అన్ని జిల్లాల్లో తనిఖీలు కొనసాగిస్తామని, ఓవర్లోడ్ వాహనాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఓవర్‌లోడ్‌తో జాతీయ, రాష్ట్ర రహదారులు దెబ్బతినడంతో పాటు ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సుపైకి కంకర లారీ దూసుకెళ్లిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకే నిరంతరం తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా లోడ్ చేస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు, భారీ జరిమానాలు విధించి యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
