సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980s రెట్రో ఫొటోలను క్రియేట్ చేసే ట్రెండ్ విపరీతంగా ఊపందుకుంది. సాధారణ ఫొటోలను నాస్టాల్జిక్ పోర్ట్రెయిట్స్‌గా మార్చే ఈ ట్రెండ్ పైకి చాలా సరదాగా.. హాని లేనిదానిలా కనిపిస్తుంది. కానీ ప్రతి ఏఐ ఇమేజ్ వెనుక భారీ డేటా సెంటర్లు, ప్రత్యేక చిప్స్, నిరంతర విద్యుత్ సరఫరా, కూలింగ్ సిస్టమ్స్, కోట్ల లీటర్ల నీటి వినియోగం ముడిపడి ఉన్నాయి. వినియోగదారులు ఒక్క క్లిక్‌తో క్షణాల్లో జనరేట్ చేస్తున్న ఈ ఫొటోల వెనుక భూమికి జరుగుతున్న భారీ నష్టం గురించి కూడా తెలుసుకుందాం రండి..
విద్యుత్ వినియోగంపై భారం:
యూఎన్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ అంచనాల ప్రకారం.. ఒక సాధారణ ఏఐ ఇమేజ్ జనరేషన్ అనేది ప్రాథమిక టెక్స్ట్-క్లాసిఫికేషన్ టాస్క్ కంటే దాదాపు 1,450 రెట్లు ఎక్కువ కరెంట్ వినియోగిస్తుంది. 2025 నాటికి గ్లోబల్ డేటా-సెంటర్ల విద్యుత్ వినియోగం సుమారు 485 TWh ఉండగా.. ఇది 2030 నాటికి 950 TWhకి చేరుకుంటుందని అంచనా. కేవలం చాట్‌జీపీటీ ఒక్కటే రోజువారీగా 2.5 బిలియన్ ప్రాంప్ట్‌లను ప్రాసెస్ చేస్తోంది. ఏఐ టెక్నాలజీ మరింత ప్రభావవంతంగా మారుతున్నప్పటికీ.. దాని వాడకం విపరీతంగా పెరిగిపోతుండటం వల్ల మొత్తం విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోతోంది.
ఏఐతో ఆవిరైపోతున్న లక్షల లీటర్ల నీళ్లు:
కరెంట్ వాడకంతో పాటు ఏఐ డేటా సెంటర్లకు అత్యంత ముఖ్యమైనది నీరు. సర్వర్లను చల్లబరచడానికి భారీగా నీటిని వినియోగిస్తారు. 2030 నాటికి ఏఐ డేటా సెంటర్ల గ్లోబల్ వాటర్ ఫుట్‌ప్రింట్ దాదాపు 9.3 ట్రిలియన్ లీటర్లకు చేరుకోవచ్చని అంచనా. ఇది సబ్-సహారా ఆఫ్రికాలోని దాదాపు 13 కోట్ల ప్రజల ఏడాదికి అవసరమైన దేశీయ నీటి అవసరాలతో సమానం. ఒక సాధారణ ఏఐ ఫొటో తయారీకి దాదాపు 29 మి.లీ అంటే రెండు టేబుల్ స్పూన్ల నీరు ఖర్చవుతుండగా.. కాంప్లెక్స్ వీడియోల తయారీకి సుమారు 4 లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు ఖర్చవుతున్నాయి.
రీబౌండ్ ఎఫెక్ట్:
ఏఐ టెక్నాలజీ వాడేందుకు సులువుగా, చౌకగా మారడంతో ప్రజలు దీన్ని విపరీతంగా వినియోగిస్తున్నారు. ఒక ఫొటో నచ్చకపోతే మరోటి, హెయిర్‌స్టైల్ మార్చడం, బ్యాక్‌గ్రౌండ్ మార్చడం, చివరకు వీడియోలుగా మలచడం వంటి ప్రయోగాలు కోట్లాది మంది చేస్తున్నారు. ఆర్థికవేత్తలు దీనిని 'రీబౌండ్ ఎఫెక్ట్' అంటారు. సాంకేతికత మరింత చౌకగా మారినప్పుడు వినియోగం ఊహించని స్థాయిలో పెరిగి, పర్యావరణ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ఎనభైల నాటి సెల్ఫీ ట్రెండ్ కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.. కానీ దీని వెనుక ఉన్న భారీ మౌలిక వసతుల డిమాండ్ పర్యావరణానికి మునుపెన్నడూ లేని విధంగా ముప్పు తెస్తోంది.
ఏఐ పర్యావరణ ప్రభావం కేవలం కరెంట్, నీటి వినియోగంతోనే ఆగిపోదు. ఏఐ ఫ్యాక్టరీలు, శక్తివంతమైన హార్డ్‌వేర్ తయారీ, క్రిటికల్ మినరల్స్ తవ్వకాలు, కాలం చెల్లిన పరికరాల ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ-వేస్ట్ 2030 నాటికి సంవత్సరానికి 2.5 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని అంచనా. క్లైమేట్ మార్చ్, గ్లోబల్ వార్మింగ్ ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న తరుణంలో.. ఈ వైరల్ ఏఐ ట్రెండ్స్ భూమి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒక చిన్న సరదా ఫొటో జనరేషన్ వెనుక ఇంత జరుగుతోందా అనిపిస్తోంది వాస్తవాలు తెలుసుకుంటే.
