న్యూఢిల్లీ: ఫాస్టాగ్ పూర్తి స్థాయి అమలుతో ప్రభుత్వానికి ఏడాదికి 20 వేల నుంచి రూ.25 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుం దని గ్లోబల్ ఫిస్టెక్ ఫెస్ట్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 2027 మార్చి నాటికి జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలను బారియర్ లెస్ గా (ఆగకుండా వెళ్లేలా) మారుస్తామని తెలిపారు.
"ఫాస్టాగ్ రాకతో టోల్ వసూళ్లు 10శాతం పెరిగి రూ.82 వేల కోట్లకు చేరాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నడుస్తున్న బారియర్ లెస్ టోల్ విధానంతో మరో రూ.7 వేల నుంచి 8 వేల కోట్లు అదనంగా రానున్నాయి. టోల్ బూత్ల నిర్వహణ ఖర్చు గతంలో 12శాతం ఉండగా, ఇప్పుడది 2-3 శాతానికి తగ్గిపోయింది" అని వివరించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 70శాతం టోల్ ప్లాజాలు, వచ్చే మార్చినాటికి 100 శాతం టోల్ కేంద్రాలు బారియర్ లెస్ గా మారనున్నా యని తెలిపారు.
